వినియోగదారుల ఆగ్రహంగ్రేటర్లో మొన్నటి వేసవి కంటే ఇప్పుడే విద్యుత్ కోతలు అధికమయ్యాయి. అవును.. ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి గ్రేటర్లో నెలకొంది. వర్షాకాలం వచ్చిందంటే..గాలి దుమారంతో చెట్లు, కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడితే సరఫరా నిలిచిపోతుంటుంది. కానీ చెట్ల కటింగ్ పేరుతో విద్యుత్ శాఖ మెయింటెనెన్స్ పనులు చేపట్టడంతో చాలాచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటం కొసమెరుపు అయితే.. వర్షాకాలానికి ముందే చేయాల్సిన పనిని ఇప్పుడు చేస్తుండడంతో పనులన్నీ అడ్డదిడ్డంగా జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండే..చిన్న వర్షానికి కూడా విద్యుత్ నిలిచిపోతుండటం..మరోవైపు కొన్ని చోట్ల అధిక బిల్లుల మోత మోగుతుండటం వినియోగదారులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది.
సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ) ; ఒకవైపు మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్ కోతలు ప్రకటిస్తే.. అప్రకటిత కరెంట్ కోతలకు లెక్కే లేదు. గ్రేటర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజూ గంటలకొద్దీ కరెంట్ సరఫరా నిలిచిపోతుందంటూ వినియోగదారులు డిస్కంకు ఫిర్యాదు చేస్తున్నారు. అసలు ఈ సమయంలో కరెంట్ పోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. లోడ్ తక్కువే అయినా.. వర్షాలు సాధారణంగానే కురిసినా.. కరెంట్ పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే శేరిలింగంపల్లి, బడంగ్పేటతో పాటు పలుచోట్ల సాధారణంగా రావాల్సిన కరెంట్ బిల్లుల కంటే రెట్టింపుగా వచ్చాయని వినియోగదారులు వాపోతున్నారు. బడంగ్‌పేట ప్రాంతంలో చాలా ఇండ్లకు కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని, ఇలా ఎందుకు వచ్చిందంటే సమాధానం చెప్పే వారు లేరని స్థానికులు వాపోతున్నారు. ఇక గృహజ్యోతి పథకం లబ్ధిదారులు సైతం జీరో బిల్లు రాకపోవడంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి.
శివారులో అప్రకటిత విద్యుత్ కోతలు..
భాగ్యనగరంలో నిరంతర విద్యుత్ సరఫరా అందనిద్రాక్షగానే మారింది. తాత్కాలిక మరమ్మతులు తప్ప.. సమస్యల శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టకపోవడంతో వర్షాకాలం ప్రారంభంలోనే విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. నగరంతో పోలిస్తే శివార్లలో పరిధి ఎక్కువ కాగా అంతరాయాలు ఎక్కువగానే ఉంటున్నాయి.
అప్రకటిత కోతలు..
బడంగ్‌పేట, రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి, ఇబ్రహీంబాగ్, మొఘల్కాలనీ, మైలార్‌దేవ్‌పల్లి,కుంట్లూరు, బండ్లగూడ జాగీర్, బాలానగర్, మారుతీనగర్, మీర్‌పేట, నారాయణగూడల్లో అప్రకటిత కరెంట్ కోతలు గంటల కొద్దీ ఉన్నాయంటూ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెలరోజులుగా మెయింటెనెన్స్ పేరుతో కొన్నిచోట్ల ప్రకటించిన సమయం కంటే ఎక్కువ సేపు కరెంట్ పోతున్నది. సర్కిళ్ల వారీగా ప్రకటించిన విధంగా ఇన్నిగంటలు కరెంట్ పోతుందని చెప్పినప్పటికీ అంతకంటే ఎక్కువ సమయమే సరఫరా నిలిచిపోతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,. వేసవిలోనే చెట్ల కొమ్మలను తొలగించాల్సి ఉండగా.. వర్షాకాలంలో ఆ ప్రక్రియ చేపట్టడంతో నగరవాసులు మండిపడుతున్నారు. ఒకవేళ మరమ్మతులు అని చెప్పినా వాటికి తగ్గట్లుగా వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ పనులు చేపట్టాలని.. కానీ అలా జరగడం లేదని వారు పేర్కొన్నారు.
స్పందించేవారే లేరు..
ఎస్పీడీసీఎల్లో సిబ్బంది నిర్లక్ష్యం ప్రతిసారీ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. సీఎండీ ముషారఫ్ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి సిబ్బందిని అప్రమత్తం చేసినా.. వారు తమ వైఖరిని మార్చుకోవడం లేదు. నాలుగురోజులుగా నగరంలో కరెంట్ పోయిందంటూ.. సుమారుగా 300కు పైగా ఫిర్యాదులు పలు ప్రాంతాల నుంచి వచ్చాయి. ఇవి కేవలం డిస్కంలో నమోదైన ఫిర్యాదులే కాగా.. అసలు తమకు కరెంట్ పోయిందంటూ చెప్పడానికి ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్లకు కానీ, సంబంధిత ఏరియాల లైన్మెన్లకు కానీ, ఏఈలకు కానీ ఫోన్ చేస్తే స్పందన లేదని పలువురు వినియోగదారులు సోషల్‌మీడియా వేదికగా మండిపడుతున్నారు.
ఫిర్యాదు చేసినా..
కుంట్లూరులో ఏఈ, లైన్మెన్ స్పందించలేదని ఒక వినియోగదారుడు ఫిర్యాదుచేస్తే, ఫలక్‌నుమా సబ్‌స్టేషన్ పరిధిలో యధాస్థితి ఉందని తెలుస్తున్నది. టీజీఎస్పీడీసీఎల్ యాప్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదని, అంతేకాకుండా సమస్య పరిష్కరించకుండానే ఫిర్యాదు మూసేస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపాపేటలో ఒకరోజులో ఆరుసార్లు కరెంట్ పోయిందంటూ వినియోగదారులు ఎంతగా మొత్తుకున్నా ఎస్పీడీసీఎల్ సిబ్బంది స్పందించడం లేదు. హెల్ప్లైన్లు కూడా డౌన్ ఉంటున్నాయని, లైన్మెన్లు స్పందించడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు.