సిటీబ్యూరో, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో వానలొస్తున్నాయని, ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ నేపథ్యంలోనే విద్యుత్ (కరెంట్)తో జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు అల్ప పీడన ప్రభావంతో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమారెడ్డి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంస్థ పరిధిలోని జోన్లు, సర్కిళ్ల చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో ప్రత్యేంగా ఆయన సోమవారం మాట్లాడి అప్రత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.
ప్రధానంగా గ్రేటర్ పరిధిలో విద్యుత్ సరఫరా సాధారణంగానే ఉందని, గ్రామీణ, జిల్లాలు, సర్కిళ్ల పరిధిలో 13 విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, ఐదు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని సీఎండీ తెలిపారు. ప్రస్తుత, పరిస్థితుల దృష్ట్యా డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని, వర్షం అధికంగా కురుస్తున్న సమయాల్లో విద్యుత్ అధికారులు, సిబ్బంది తగిన విద్యుత్ సామగ్రితో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రతి సెక్షన్లో 30 పోల్స్, ప్రతి డివిజన్లో అదనంగా 20 మంది తాత్కాలిక సిబ్బంది, కండక్టర్, సంబంధిత సబ్ స్టేషన్లు, ప్యూజ్కాల్ ఆఫీస్(ఎఫ్ఓసీ)లో ఉండి సరఫరా తీరును పర్యవేక్షిస్తూ ఉండాలి. ఎక్కడైనా అంతరాయాలు ఏర్పడినప్పుడు వాటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్, జిల్లాలలోని కంట్రోల్ రూమ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని సీఎండీ సూచించారు.
ఇటీవల ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, ప్రజలు స్వీయ భద్రతా చర్యలు పాటించాలని సీఎండీ రఘుమారెడ్డి కోరారు. కిందకు వంగిన, కూలిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని, వాటిని తాకడం చేయరాదన్నారు. చెట్ల మీద, వాహనాల మీద విద్యుత్ వైర్లు పడితే వాటిని తాకే ప్రయత్నం చేయరాదు. రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ తీగలు పడితే ఆ నీళ్లలోకి వెళ్లరాదు. వర్షం పడేటప్పుడు, తగ్గిన తర్వాత పశువులను విద్యుత్ వైర్లు, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా తీసుకువెళ్లాలని సూచించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, వర్షం కురిసేటప్పుడు విద్యుత్ లైన్లు ఉన్న చెట్ల కింద నిలబడటం, చెట్లు ఎక్కడం చేయరాదని, అపార్టుమెంట్ సెల్లార్లలో ఉన్న మీటర్ ప్యానెల్ బోర్డులను మొదటి అంతస్తులోకి మార్చుకోవాలని సూచించారు. విద్యుత్‌కు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912/100/స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574లకు ఫోన్ చేయాలని, సంస్థ మొబైల్ యాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సీఎండీ జి.రఘుమారెడ్డి పేర్కొన్నారు.