సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లోని విద్యుత్ స్టోర్స్‌లో నో స్టాక్ అంటూ అధికారులు చెబుతుండడంతో కాంట్రాక్టర్లు, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా సామగ్రి రాకపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దక్షిణ డిస్కంకు గ్రేటర్ హైదరాబాద్‌లో 67లక్షల కనెక్షన్లు ఉన్నాయి. నెలనెలా శివారు ప్రాంతాల్లో వినియోగదారులు పెరుగుతున్నారు. కొత్త ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్సులు కరెంటు కనెక్షన్ తీసుకోవాలన్నా, ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలన్నా విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి.
శివారు ప్రాంతాల్లోని పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలు, బహుళ అంతస్తులకు విద్యుత్ పనులకు కూడా విద్యుత్శాఖకే దరఖాస్తు చేసుకుంటే ఎస్టిమేషన్ వేసి మెటీరియల్ ఇచ్చి ప్రైవేటు కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో మెటీరియల్ లేక పనులన్నీ ఆగిపోయాయని వినియోగదారులు చెబుతున్నారు. 500కేవీలు, 63కేవీలు లేక చాలాచోట్ల ప్రధాన పనులు ఆగిపోయాయని కాంట్రాక్టర్లు చెప్పారు. డీడీలు కట్టి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు డీటీఆర్లు రావడం లేదని, కొన్నిచోట్ల మాత్రమే డీటీఆర్లు పరిమిత సంఖ్యలో ఇస్తున్నారని వారు పేర్కొన్నారు.
ప్రైవేటు మార్కెట్లోనూ సామగ్రి దొరికినా నాణ్యమైనవి తామే సరఫరా చేస్తామని దరఖాస్తుల సమయంలోనే మెటీరియల్‌తో సహా ముందస్తుగానే చెల్లింపులు చేయించుకుంటున్న డిస్కం మాత్రం.. కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన సామగ్రి ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ వినియోగదారులు, కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇటీవల ఓసీల కారణంగా కనెక్షన్లు నిలిచిపోయినప్పటికీ.. మంజూరైనవాటికి మెటీరియల్ లేక పనులు ముందుకు సాగడం లేదు.
డిస్కం పరిధిలో జిల్లాల వారీగా పలుచోట్ల స్టోర్స్‌లో అరకొరగా ఉన్న సామగ్రిని అడ్డదారిలో లంచాలు ఇచ్చినవారికి, ప్రజాప్రతినిధుల రికమెండేషన్ ఉన్నవారికే ఇస్తున్నారంటూ కాంట్రాక్టర్ చెబుతున్నారు. 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లకు రూ. 8వేల నుంచి రూ. 10వేలు, 63 కేవీఏకు రూ. 5వేల నుంచి రూ. 7వేలు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి పలువురు ఎస్పీడీసీఎల్ సీఎండీకి, ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు.
ఇది ఏ ఒక్క స్టోర్స్కో పరిమితం కాలేదు. గ్రేటర్‌లోని స్టోర్స్‌లో ఇటీవల కొంత మెటీరియల్ వచ్చినా వాటి విషయంలో కూడా మేనేజ్మెంట్ నడుస్తున్నదని, దీనిపై సిఫారసులు, డబ్బులతోనే వ్యవహారం కొనసాగుతున్నదంటూ స్టోర్స్ దగ్గర కొందరు కాంట్రాక్టర్లు చర్చించుకోవడం కనిపించింది. ట్రాన్స్ఫార్మర్లు వచ్చిన రోజు ఎప్పుడొస్తుందా అని వేచిచూసి రాగానే వాటిని తమ ఖాతాలో వేసుకోవడానికి అక్కడున్న వారితో పాటు మింట్‌కాంపౌండ్‌లో ఉన్నవారిని కూడా ప్రసన్నం చేసుకుంటే తప్ప.. తమకు డీటీఆర్లు కానీ ఇతర సామగ్రి కానీ దొరికే అవకాశం లేదని, చివరకు ఆటోడ్రైవర్లే ఈ మెటీరియల్ ఇప్పించడంలో తమకు కావాల్సినవి తీసుకుని కీలకంగా వ్యవహరిస్తున్నారని కొందరు చెప్పుకొంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నుంచి డీటీఆర్‌ల కోసం డబ్బులు కట్టించుకుని ఇప్పటికీ ఇవ్వకుండా తిప్పుకోవడంతో వారికి ఈ సీజన్లో కరెంట్ సరఫరా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారు డీడీలు కట్టి వేచిచూస్తున్నామని స్టోర్స్‌కు వెళ్తే నీకేం రెకమెండేషన్ ఉందంటూ అడుగుతున్నారని కొందరు రైతులు చెప్పారు.
పర్చేజింగ్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్ విభాగంతో సమన్వయం చేసుకుంటూ స్టోర్స్‌లో మెటీరియల్ కోసం ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ ఒక కమిటీని ఏర్పాటు చేశామని ప్రకటించి కమిటీ ద్వారా మెటీరియల్ కొనుగోలు చేస్తామని చెప్పారు. కమిటీలో ఆరుగురు సభ్యులు ఉండగా ప్రాధాన్యం కలిగిన హోదాలో అసలు మెటీరియల్‌తో సంబంధమున్న పీఅండ్ఎంఎం డైరెక్టర్‌నే పెట్టకుండా ఆయనను కేవలం సభ్యుడుగా ఎంపికచేసి సీఎండీకి అనుకూలమైన మరో వ్యక్తిని పెట్టడం గమనార్హం. ఈ కమిటీకి కీలకమైన బాధ్యతల్లో ఉన్న వ్యక్తిపై గతంలో పనిచేసిన సీఎండీ వద్దకు అనేక ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై ఆయన చర్యలు తీసుకుని కీలకమైన విభాగాలు ఆయనకు లేకుండా చేశారని మింట్‌కాంపౌండ్‌లో చెప్పుకుంటున్నారు.
అయితే అదే వ్యక్తిని ఇప్పుడు వచ్చిన కొత్త ముఖ్య అధికారి దగ్గర పెట్టుకుని అన్ని విభాగాలపై పెత్తనం చెలాయించేలా చూస్తున్నారని, అసలు వ్యక్తికి మెటీరియల్ పర్చేజింగ్ కమిటీకి కీలక బాధ్యతలు ఇవ్వడం వెనక ఏం జరుగుతున్నదంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఆ నామినేటెడ్ పోస్టులో ఉన్న వ్యక్తికి విద్యుత్ మెటీరియల్ విషయమే తెలియదని, ఇంతవరకు ఆయన అటువంటి బాధ్యతల్లో ఎన్నడూ లేరని డిస్కంలో ఓ సీనియర్ అధికారి చెప్పారు. అటువంటి వారు ఆ బాధ్యతల్లో ఉంటే కేవలం టెండర్లు, కమీషన్ల వైపు దృష్టి ఉంటుంది తప్ప.. మెటీరియల్‌లో నాణ్యత కరువైపోతుందంటూ డిస్కంలో చర్చ జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో అసలే విద్యుత్ సామగ్రి లేక సతమతమవుతున్న డిస్కం వినియోగదారులకు ఈ కమిటీ వ్యవహారం గందరగోళంగా కనిపిస్తుండగా సిబ్బంది సైతం తలలు పట్టుకుంటున్నారు.
ఈ వ్యవహారం ఒక పట్టాన తేలేది కాదని, కీలక వ్యక్తి చెప్పిందే ప్రధానమైన వ్యక్తి వింటున్నారని, ఆయనకు నచ్చని కంపెనీలు, నచ్చకుండా ఏ వ్యవహారం జరిగినా నాణ్యత ఉన్నవాటికి కూడా చెక్ పెడతారని, ఈ విషయంలో కేవలం నామమాత్రంగా ఇతర సభ్యులను పెట్టారు తప్ప కీలక నిర్ణయాలన్నీ ఆ కీలకవ్యక్తే తీసుకుంటారని మింట్‌కాంపౌండ్‌లో మాట్లాడుకుంటున్నారు. విద్యుత్ వ్యవస్థకు సంబంధించి 35వేల రకాల సామగ్రి ఉంటుందని, ఈసామాగ్రికి సంబంధించి కనీసం అవగాహన కూడా చాలా మందికి ఉండదని, వీటిపై అవగాహన ఉన్నవారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం తనను మచ్చిక చేసుకున్న వ్యక్తికే ముఖ్య అధికారి కీలక స్థానం కట్టబెట్టడంతో టెండర్ల మాయ, కమీషన్ల గోల వెరసి నాణ్యత లేని మెటీరియల్, ప్రాధాన్యం లేని క్రమంలో వస్తుందని డిస్కంలో సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతీరోజు 5వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగే అవకాశముందని, ఇప్పటికే 4300 మెగావాట్లకు పైగా వినియోగం జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లు డిస్కం సమ్మర్ యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి. అయితే వేసవి ప్రణాళిక చాలా పనులు ప్రత్యేకించి కేబుల్‌తో సంబంధమున్న పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు. గత సంవత్సరం ప్రకటించిన పనులే కాకపోగా ఈసారి కూడా అదే పరిస్థితి ఉండడంతో మిగతాపనులు నామమాత్రంగా కానిచ్చేస్తున్నారు.
సామాగ్రి కోసం టెండర్లు పిలిచి డీడీలు కట్టించుకున్నా ఇప్పటివరకు సామగ్రి ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఒక సీనియర్ అధికారి చెప్పారు. వేసవిలోడ్ పెరుగుతుండడంతో పాటు ఇటీవల గ్యాస్ వినియోగం తగ్గి కరెంట్ స్టవ్‌ల వినియోగం పెరగడంతో ఆ లోడ్ కూడా తోడై వినియోగం విపరీతంగా పెరిగిందని ఆయన తెలిపారు. ఓవర్‌లోడ్ కారణంగా ఫీడర్లు ట్రిప్ కరెంట్ సరఫరాలో అంతరాయాలేర్పడుతున్నాయని, దీంతో ఒక ఫీడర్ నుంచి సరఫరా ఇచ్చి మరోవైపు ఫీడర్‌ను బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. ఇక కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు రావాలన్నా, లేదా పనులు చేయాలన్నా మెటీరియల్‌తో సర్వం ముడిపడి ఉంటుంది. మెటీరియల్ కార్డులో సామగ్రి తీసుకున్నట్లుగా ఉంటేనే బిల్లులు చేసుకునే అవకాశముంటుందని కానీ గత సంవత్సర కాలంగా అనేక పనులకు సంబంధించిన బిల్లులు మెటీరియల్ కార్డ్ కారణంగా ఆగిపోయాయని కాంట్రాక్టర్లు చెప్పారు.