SPDCL | సిటీబ్యూరో:తమపై పని భారం పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా బిల్లులు చెల్లించనివారి ఇండ్లకు కరెంట్ సైప్లె డిస్కనెక్ట్ చేయకుండా అప్పట్లో ప్రభుత్వమే అడ్డుకుందని, ఇప్పుడేమో కోట్ల రూపాయల బకాయిలు వసూలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని విద్యుత్ లైన్మెన్లు ఆరోపిస్తున్నారు. దమ్మాయిగూడలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద లైన్మెన్ల జాక్ ఆధ్వర్యలో లైన్మెన్లు శుక్రవారం ఆందోళన చేపట్టారు.
ఈసందర్భంగా డీఈ, ఏఈకి వ్యతిరేకంగా వారు నినాదాలిచ్చారు. తాము 24గంటలు డ్యూటీలో ఉంటామని, ఎప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఆయా ప్రాంతాలకు వెళ్లి సైప్లె పునరుద్ధ్దరించాలని, అటువంటి పరిస్థితుల్లో తాము సమయానికి రావట్లేదంటూ.. మెమోలు ఇస్తున్నారని, కొత్తగా వచ్చిన అధికారులు తమను వేధిస్తున్నారంటూ ఆరోపించారు. వేసవి వస్తున్న సందర్భంగా తమపై పనిభారం మరింత పెరుగుతుందని..అధికారులు తమకు సహకరించకుండా ఒత్తిడి చేస్తుండడంతో తాము ఇబ్బంది పడుతున్నామని వారు చెప్పారు.