SPDCL | సిటీబ్యూరో/ మేడ్చల్/ సైదాబాద్/మలక్‌పేట/చార్మినార్: మే నెలలో కృష్ణానగర్ ప్రధాన రహదారిలో వీధి దీపాల స్తంభానికి విద్యుత్ సరఫరా తీగలు ఉన్నాయి. అనుకోకుండా స్తంభానికి తగిలిన ఒక హార్డ్ వేర్ ఇంజినీర్ స్తంభానికి కరెంట్ పాస్ కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గత సంవత్సరం అడ్డగుట్ట ప్రాంతంలో అడ్డదిడ్డంగా ఉన్న కేబుళ్లకు విద్యుత్ సరఫరా అయి అక్కడే ఆడుకుంటున్న బాలిక కరెంట్ షాక్‌కు గురికాగా, ఆమెను కాపాడబోయే క్రమంలో అపార్ట్మెంట్ వాచ్మెన్ భార్య ప్రాణాలు కోల్పోయింది. కంచెలేని ట్రాన్స్ఫార్మర్లు.. తుప్పుపట్టిన ఇనుప స్తంభాలు.. వేలాడుతున్న తీగలు.. మూతల్లేని ఫ్యూజ్ బాక్సులు.. రోడ్ల మధ్యన స్తంభాలు.. ఇలా దక్షిణ డిస్కంలో క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా ఉన్నది.
పలు బస్తీల్లో ఇండ్ల సమీపం నుంచి, మరి కొన్ని ఇండ్ల మీద నుంచి , బాల్కనీల పక్క నుంచి 11 కేవీ విద్యుత్ తీగలు వెళ్తున్నాయి. ఈ తీగలకు మీటరు దూరంలో ఉన్నా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. విద్యుత్ తీగలు గతంలో తెగిపడిన కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. విద్యుత్ నిర్వహణలో భాగంగా ప్రతీవారం 33 కేవీ విద్యుత్ లైన్లను సిబ్బంది పర్యవేక్షిస్తూ తీగల స్థితిగతులను తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలాచోట్ల సిబ్బంది అసలు తీగలవైపే చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
సిటీలోని బహదూర్‌పురలో ఇటీవల రెండు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడంతో పుట్‌పాత్ దుకాణాల్లో వస్తువులు కాలిపోయాయి. ఓల్డ్‌సిటీలోని గౌలిపుర, కందికల్ బోయిగూడ, ఛత్రినాక, సుల్తాన్‌షాహీ, ఉప్పుగూడ, శివాజీనగర్ తదితర ప్రాంతాల్లో కంచె లేని ట్రాన్స్ఫార్మర్లు అనేకం ఉన్నాయి. రోడ్డు పక్కన, ఇండ్ల పక్కన ట్రాన్స్ఫార్మర్లకు కంచె నిర్మించలేదు. ఇక స్కూళ్లు, పబ్లిక్ టాయిలెట్స్, ప్లేగ్రౌండ్స్ పక్కన ట్రాన్స్ఫార్మర్లు ఉండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ బాబాగూడ ఎస్సీ కాలనీలో ఉన్న సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. ట్రాన్స్ఫార్మర్కు చెట్ల తీగలు అల్లుకుపోయి ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి.
ఏ కాలనీలో చూసినా విద్యుత్ స్తంభాలకు భయంకరంగా వేలాడుతున్న కేబుళ్లు కనిపిస్తున్నాయి. వాటిని తమ అవసరాల కోసం కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఏర్పాటుచేసి నిర్వహణ గాలికి వదిలేస్తున్నారు. ఈ క్రమంలో 28 కంపెనీల ప్రతినిధులతో సీఎండీ ముషారఫ్ ఫరూఖి గతంలో సమావేశమై ఆ తీగలను తొలగించాలని సూచించారు. అయితే ఇతర వైర్ల సంగతేమో కానీ చాలాచోట్ల కరెంట్ తీగల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముసారాంబాగ్ డివిజన్ ఈస్ట్ ప్రశాంత్‌నగర్ కాలనీ, బల్దియా వార్డు ఆఫీస్‌కు వెళ్లే మూల మలుపు వద్ద విద్యుత్ లైన్లు ఏకంగా ఇంటినే ఆనుకుని ఉన్నాయి. జవహర్‌నగర్ కార్పొరేషన్లో కరెంటు తీగలు ఇండ్లపైనే ఉన్నాయి. కార్పొరేషన్‌లోని కృష్ణపురికాలనీలో ఓ ఇంటిపై కరెంటు తీగలు ఉండటంతో కుటుంబమంతా బతుకు జీవుడా అంటూ జీవిస్తున్నది. కూకట్పల్లి, కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్లలో స్తంభాలకు ఉన్న కేబుల్స్ ప్రాణాంతకంగా ఉన్నాయి.
బంజారాహిల్స్‌లో 19698 , సైబరాబాద్‌లో 48219, హబ్సిగూడలో 59645, హైదరాబాద్ సెంట్రల్లో 24021, హైదరాబాద్ సౌత్‌లో 20835 , మేడ్చల్‌లో 69889, రాజేంద్రనగర్‌లో 51965, సరూర్‌నగర్‌లో 47359, సికింద్రాబాద్ సర్కిల్లో 25097 స్తంభాలు ఉన్నాయి. ఇందులో గత సంవత్సరం డిసెంబర్ 31 నాటికి మొత్తం 6306 పోల్స్ అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రధాన ఏరియాల్లో 33,11 కేవీ ఎల్టీలు దాదాపుగా మార్చినట్లు విద్యుత్ అదికారులు తెలిపారు. కొన్నిచోట్ల మార్చడానికి వీలు లేకుండా ఉన్నవాటి విషయంలో కూడా ఎలా చేయాలనేదానిపై సిబ్బందితో, స్థానికులతో చర్చిస్తున్నామని వారు తెలిపారు.