Double Decker Bus | సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): నగరంలో కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సుల వినియోగం సరిగా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంతో డబుల్ డెక్కర్ బస్సులకు ఉన్న అనుబంధాన్ని భావితరాలకు పదిలంగా ఉంచాలనే లక్ష్యంతో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 6 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేశారు. వాటిని హెచ్ఎండీఏ ఆధీనంలో నగరంలోని కొన్ని మార్గాల్లో తిప్పుతున్నారు. కానీ రోజు ఎలక్ట్రిక్ బస్సుల్లో ఎక్కేవారు కరువయ్యారు. ఉచిత సర్వీసుగా తిప్పుతున్న ఈ బస్సుల్లో కండక్టర్ ఉండడు, కేవలం డ్రైవర్ మాత్రమే ఉంటాడు. ఎంతో అత్యాధునిక ఫీచర్లతో ఉన్న ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్లో 60 మంది వరకు కూర్చుని ప్రయాణం చేసే అవకాశం ఉన్నా… ప్రయాణికులు కరువయ్యారు.
ఒక్కో బస్సు కోసం సుమారు రూ. 2 కోట్లకు పైగా వెచ్చించారు. కానీ వాటిని వినియోగించడంలో మాత్రం హెచ్ఎండీఏ యంత్రాంగం విఫలమవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ పర్యాటకుల కోసం బస్సులను నడుపుతున్నామని చెబుతున్నా, అవి ఏ సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళతాయో తెలిపేలా సమాచారం నగర వాసులకు అందుబాటులో లేదు. అలాగే నగరంలోని ఇతర చారిత్రాత్మక కట్టడాలైన చార్మినార్, గోల్కొండతో పాటు చాలా కట్టడాలు ఉన్నా, అక్కడికి ఈ బస్సులు ఎప్పుడు వచ్చి వెళుతున్నాయో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా హెచ్ఎండీఏ అధికారులు బస్సుల్లో ఎక్కువ మంది పర్యాటకులు ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.