సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : గత ఎన్నికల్లో హైదరాబాద్ సంతోష్‌నగర్‌లో ఓ యువతి తన ఓటు వేసి ఆ తర్వాత మళ్లీ ఓటు వేయడానికి వచ్చింది. పోలింగ్ అధికారులు ఆమె చేతి మీద ఉన్న సిరాను చూసి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఆ యువతిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయి తనను దొంగ ఓటు వేయమన్నవాళ్లు మళ్లీ తనవైపే చూడలేదంటూ తన పరిస్థితి దారుణంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయపార్టీలు అన్ని అవకాశాలు వినియోగించుకుంటాయి. ముఖ్యంగా ఎన్నికల్లో ఒకరి ఓటు మరొకరు వేస్తుంటారు. ఓటర్ లిస్ట్‌లో ఎవరి పేరుందో ఆ వ్యక్తి మాత్రమే ఓటు వేయాల్సి ఉండగా అలా కాకుండా అతనికి బదులు వేరే వ్యక్తి ఓటేసినా, వేసేందుకు ప్రయత్నించినా చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది. దొంగ ఓట్లు వేయించినా, వేసినా చట్ట ప్రకారం నేరమే. భారతీయ శిక్షాస్మృతి, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరం నిర్ధారణ అయితే కఠినశిక్షలు తప్పవని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో దొంగ ఓటు వేసిన వారి భవిష్యత్తు పూర్తిగా అయోమయంలో పడుతుందని, వారికి రెండు మూడు ఎన్నికల వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా కల్పించరని, వారి కదలికలపై ఎప్పటికప్పుడు పోలీసు నిఘా ఉంటుందని వారు పేర్కొన్నారు.
దొంగ ఓటు వేసినట్లు తేలితే ఐపీసీ 171(ఎఫ్) ప్రకారం ఏడాది జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ఓటు హక్కు ఉన్నవాళ్లంతా తమ ఓటును వినియోగించుకోవాలి. అయితే ఎవరైనా దొంగ ఓటు వేసినట్లు తేలితే వారికి ఏడాది నుంచి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంటుంది. యువత తమ భవిష్యత్తును కోల్పోతారు. ఉద్యోగాలకు, ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హత కోల్పోతారు. కంపెనీల్లో పనిచేసే యువతకు కూడా దొంగ ఓటు వేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అయితే యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల సంఘం చెబుతున్నది.
దొంగ ఓటు వేయడానికి వచ్చినవారు కానీ, వేసిన వారు కానీ అధికారులకు పట్టుబడితే తమను దొంగ ఓటు వేయమని ప్రోత్సహించి డబ్బులు ఇచ్చినవారు మళ్లీ అటువైపు చూడరు. ఎందుకంటే వారికి కూడా శిక్ష ఉంటుంది కాబట్టి, అటువంటి ప్రలోభాలకు లొంగి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లు ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిపై అనుమానం వచ్చినా, అతను దొంగ ఓటరు అని భావించినా వెంటనే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి రెండు రూపాయలు చెల్లిస్తే అనుమానితుడి ఓటర్ స్లిప్, గుర్తింపుకార్డును చెక్ చేసి నిజ నిర్ధారణచేస్తారు. ఇటువంటి సందర్భాలు కూడా కీలకంగా ఉంటాయి.
ఎన్నికల సమయంలో ఓటరు జాబితాలో పేరు మిస్ అవ్వడం, మరికొందరు ఇతరుల పేరుతో దొంగ ఓట్లు వేయడం జరుగుతూ ఉంటుంది. భారత ఎన్నికల సంఘం ఓటరు హక్కును కోల్పోకుండా 49(పీ)చట్టాన్ని తెచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం పోలింగ్‌స్టేషన్ పీవోను కలిసి ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్పును చూపించి తన ఓటు వేయాలని అడగాలి. అయితే ఈ ఓటును వేయాలంటే ఈవీఎంల ద్వారా వేయలేమని, కేవలం బ్యాలెట్ పేపర్ల ద్వారా మాత్రమే వేయవచ్చని ఎన్నికల అధికారులు చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకదశకు చేరుకుంది. పోలింగ్ సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి దిగింది. ఇప్పటికే పలుచోట్ల డబ్బుల పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న నేతలు ప్రస్తుతం దొంగ ఓట్లను కూడా ప్రోత్సహించే పనిలో పడ్డారు. ఎన్నిక సమయంలో యువతను ఈ తరహాలో వినియోగించుకోవడానికి కాంగ్రెస్ పన్నాగాలు పన్నిందని ప్రచారం జరుగు
తున్నది.