సిటీ బ్యూరో, నవంబర్ 10(నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎన్నికల అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. నోటిఫికేషన్ మొదలు ప్రచారం ముగిసేదాకా ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నా చూసీచూడనట్లు వదిలేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏకంగా ప్రార్థనా మందిరాల్లో ప్రచారం చేసినా పట్టించుకోలేదు.
బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ అనుచరులు బహిరంగంగా అడ్డుకొని దాడికి తెగబడిన సమయంలో ఎన్నికల అధికారులు ఎక్కడా కనిపించలేదు. రైతులు, కుల సంఘాలు, నిరుద్యోగులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని వారిపైనా దాడులు చేసినప్పుడూ కనీసం స్పందించలేదు. అవన్నీ ఒకెత్తు అయితే మూడు రోజులుగా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు జూబ్లీహిల్స్‌లోని ప్రతి ఇంటికీ తిరిగి ప్రలోభాలకు పాల్పడుతున్నా అటువైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికల అధికారుల ప్రోద్బలంతో డబ్బులు, చీరలు, కుక్కర్లు విచ్చలవిడిగా పంచుతూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.
మొక్కుబడిగా ఫ్లయింగ్ స్కాడ్ తనిఖీలు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ నియోజకవర్గ పరిధిలోని ఇండ్లలో నగదు, తాయిలాలను నిల్వ చేసినా, పంపిణీ చేస్తున్నారనే సమాచారం వచ్చినా ఎన్నికల కమిషన్ ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ వెళ్లి తనిఖీలు నిర్వహించాలి. పట్టుబడిన డబ్బు, వస్తుసామగ్రిని సీజ్ చేసి వారిని పోలీసులకు అప్పగించాలి. కానీ ఆ బృందాలు ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించలేదని జూబ్లీహిల్స్ ఓటర్లు ఆరోపిస్తున్నారు.
కొన్నిచోట్ల సోదాలు చేసినా నామమాత్రంగా పోలీసు బలగాలతో వెళ్లి మమ అనిపిస్తున్నారని విమర్శిస్తున్నారు. అధికార కాంగ్రెస్ నేతల ఇండ్లలో డబ్బుల సంచులు ఉన్నట్లు ఫిర్యాదు చేసినా ఆకస్మిక తనిఖీలు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు ఫిర్యాదు అందిన స్థలానికి వెళ్లేసరికి అక్కడ అంతా గప్‌చుప్ అవుతున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలు కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా పంచుతున్నా ఒక్క రూపాయి కూడా పట్టుబడకపోవడం ఎన్నికల అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నదని మండిపడుతున్నారు.
కాంగ్రెస్ ఉల్లంఘనలకు గ్రీన్‌సిగ్నల్ !
ఎన్నికల నిబంధనల ప్రకారం ఆదివారం సాయంత్రం 6గంటల తర్వాత ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నియోజకవర్గ పరిధిలో ఉండకూడదు. స్థానికంగా ఉన్న నేతలైనా పార్టీ కార్యాలయాలు, పబ్లిక్ ప్రాంతాల్లో సంచరించకూడదు. గ్రూపులుగా ఏర్పడి సమావేశాలు పెట్టకూడదు. కానీ సోమవారం నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు దగ్గరుండి ప్రలోభాలను పర్యవేక్షించారు. నోట్ల కట్టలు, తాయిలాలను బూత్ స్థాయి నాయకుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేశారు.
ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు ఎక్కడా కనిపించలేదు. సైరన్లతో మంత్రుల వాహనాలు వీధులన్నీ తిరుగుతున్నా అడ్డుకునే వారు కరువయ్యారు. సోమవారం సాయం త్రం ఎర్రగడ్డ కార్పొరేటర్ ఇంట్లో డబ్బు సంచులున్నట్లు వచ్చిన ఫిర్యాదుతో ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ తనిఖీలు చేపట్టారు. గంట పాటు సోదాలు చేసి ఏమీ లేదని తేల్చేసి వెళ్లిపోయారు. ఫిర్యాదు అందిందని కాంగ్రెస్ నేతలకు సమాచారం అందడం వల్లే ఏమీ దొరకలేదనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటిదాకా ఉల్లంఘనలను పట్టించుకోకున్నా కనీసం పోలింగ్‌లో రిగ్గింగ్ జరగకుండానైనా అడ్డుకట్ట వేయాలని ఎన్నికల అధికారులను జూబ్లీహిల్స్ ప్రజలు కోరుతున్నారు.