షేక్‌పేట, నవంబర్ 11:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా మంగళవారం షేక్‌పేట్ డివిజన్లో పోలింగ్‌ను ఎన్నికల అధికారులు గాలికి వదిలివేశారు. ఇష్టానుసారంగా రిగ్గింగ్ జరుగుతున్నదని ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఎవరు ఫిర్యాదు చేస్తే వారే లక్ష్యంగా పోలీసులు వేధింపులకు పాల్పడటం విచారకరం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంత మొత్తుకున్నా మైనారిటీ ప్రాంతాల్లో పోలింగ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంపై నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా షేక్‌పేట్ డివిజన్లో గతంలో 55 పోలింగ్ బూత్‌లు ఉండగా ఈ ఎన్నికలో 70కి పెంచారు. దీంతో మంగళవారం సాయంత్రం వరకు 54,490 ఓట్లలో 23,087 ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ శాతం 42.36గా నమోదైంది.
దొంగ ఓటర్లను పట్టుకున్న జీవన్‌రెడ్డి
షేక్‌పేట డివిజన్లోని విరాట్‌నగర్ బూత్ నెంబర్ 22 వద్ద ఓట్లు వేయడానికి వచ్చిన దొంగ ఓటర్లను ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పట్టుకున్నారు. ఒక్కో మహిళ 20 ఓట్లు వేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టోలిచౌకి గుల్షన్ కాలనీలో పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, బీఆర్ఎస్ నాంపల్లి ఇన్‌ఛార్జి సీహెచ్.ఆనంద్‌కుమార్ గౌడ్, నాయకులు కె.శేఖర్‌రెడ్డి, చెరక మహేష్ తదితరులు కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఇక్కడ రిగ్గింగ్‌ను అడ్డుకోవడానికి దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రయత్నించారు. ఇక్కడి పోలీసుల తీరుపై దాసోజు శ్రవణ్‌కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఇదిలా ఉండగా సమతా కాలనీలో ఉన్న అపెక్స్ స్కూల్ వద్ద ఉన్న పోలింగ్ బూత్ నెంబర్లు 4,5,6,7,8ల వద్ద రిగ్గింగ్ జరుగుతుందని సమాచారం అందుకున్న దాసోజు శ్రవణ్‌కుమార్ అక్కడికి వెళ్లగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయిజారి పోకుండా పోలీసులు వెంటనే స్పందించి లాఠీఛార్జి చేసి, ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. షేక్‌పేట్ డివిజన్లోని టోలిచౌకి పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న ఓటింగ్ సరళిని మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, కార్వాన్ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జి ఠాకూర్ జీవన్‌సింగ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు, పోలీసుల తీరుపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.