జూబ్లీహిల్స్, అక్టోబర్24: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని.. నిర్ధేశిత 407 పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు. ఉప ఎన్నికలలో… 58 మంది అభ్యర్థులు.. 1 నోటాతో కలిపి మొత్తం 59 అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు. ఈవీఎంల ద్వారా ఈ ఎన్నికలలో 4 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లు.. ఓటింగ్ కంపార్ట్మెంట్ సాధారణ సైజు కంటే పెద్దగా ఉంటుందని వెల్లడించారు.
పోలింగ్ కేంద్రంలోకి ప్రిసైడింగ్ ఆఫీసర్ తప్ప ఓటర్లకు, ఏజెంట్లకు, ఇతర పోలింగ్ పర్సన్స్‌తో పాటు భద్రతా సిబ్బందికి అనుమతి లేదని.. పోలింగ్ కేంద్రంలోకి ఒక ప్రిసైడింగ్ అధికారికి తప్ప పైన పేర్కొన్న ఎవరికీ అనుమతి లేదని వెల్లడించారు. ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ గుర్తింపుగా పరిగణించవద్దని.. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 12 ఫొటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి ఈఐఎస్‌తో అనుసంధానించాలని తెలిపారు. ఉప ఎన్నిక కోసం 600 మంది ప్రిసైడింగ్ అధికారులు.. 600 మంది సహాయ అధికారులు.. 1200 మంది అదర్ పోలింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలుచేసేందుకు 15 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, 15 ఫ్లైయింగ్ స్కాడ్ టీమ్‌లు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రూ.2.83 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎంసీసీ ఉల్లంఘనలకు పాల్పడ్డ 11 మందిపై కేసులు నమోదుచేసినట్లు..సోషల్‌మీడియాలో నిఘా పెట్టినట్లు తెలిపారు.
ఓటర్ల సౌలభ్యం కోసం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని కొత్త విధానాలకు శ్రీకారం చుట్టిందని.. ఇందులో భాగంగా బ్యాలెట్ పేపర్లలో పోటీలో ఉన్న అభ్యర్థుల కలర్ ఫొటోలు తొలిసారి ముద్రిస్తుందన్నారు. గతంలో 1600 నుంచి 1400 మంది వరకు ఉన్న ఓటర్ల స్థానంలో 1200 మంది లోపు ఓటర్లతో.. విశాలమైన ఓటర్ క్యాబిన్ల ఏర్పాటు.. పెద్ద అక్షరాలతో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లు.. దివ్యాంగులకు పోలింగ్ బూత్‌లోకి సహాయ ఓటరుకు అనుమతి.. ఇలా అనేక వినూత్న విధానాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా.. ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సన్నద్ధంగా ఉందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పారా మిలటరీ బలగాలను మోహరించనున్నట్లు తెలిపారు. అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, విజిలెన్స్ ఏసీపీ నరసింహారెడ్డి, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ అపూర్వరావు తదితరులు పాల్గొన్నారు.