హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలు ఓటర్లకు పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను ఉర్దూ భాషలో కూడా అందుబాటులో ఉంచాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుతో పాటు ఉర్దూ కూడా అధికారిక ద్వితీయ భాష అయినప్పటికీ, ఎన్నికల కమిషన్ ఎన్యూమరేషన్ ఫారాలను ఉర్దూలో ముద్రించకపోవడం లక్షలాది ఉర్దూ మాట్లాడే ఓటర్లకు ఇబ్బందులు కలిగిస్తోందని అన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్లో ఆంగ్ల భాషలో, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో తెలుగులో మాత్రమే ఫారాలను అందిస్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఉర్దూ మాతృభాషగా ఉన్న వృద్ధులు, నిరక్షరాస్యులు, సాధారణ ప్రజలు ఫారాలను సరిగ్గా అర్థం చేసుకుని పూరించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హులైన ఓటరికి తన భాషలో సేవలు అందించడం ఎన్నికల కమిషన్ బాధ్యత అని పేర్కొన్నారు. అందువల్ల ఎన్నికల కమిషన్ వెంటనే ఉర్దూ భాషలో కూడా ఎన్యూమరేషన్ ఫారాలను ముద్రించి పంపిణీ చేయాలని కోరారు. అలాగే ఉర్దూ మాట్లాడే ప్రాంతాల్లో ఉర్దూ తెలిసిన సిబ్బందిని నియమించి ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని యాకూబ్ పాషా విజ్ఞప్తి చేశారు. భాషా సమానత్వాన్ని గౌరవిస్తూ ప్రతి ఓటరికి సులభంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు లేఖ రాయనున్నట్లు యాకూబ్ పాషా తెలిపారు.