Voters List | జూబ్లీహిల్స్, జూన్ 14: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ తుది ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎలక్షన్) మంగతాయారు గత రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో త్వరలో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటరు జాబితా ఫైనల్ పబ్లికేషన్ త్వరలో ప్రకటించనున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
యూసుఫ్‌గూడలోని జీహెచ్ఎంసీ 19వ సర్కిల్ కార్యాలయంలో ఈఆర్ఓ జాకియా సుల్తానా ఆధ్వర్యంలో ఏఆర్వో, ఖైరతాబాద్ తహసీల్దార్ నయీముద్దీన్ ఇతర ఏఈఆర్వోలు బూత్ స్థాయి ఎన్నికల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతివారం రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తూ పారదర్శక ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ), యూసుఫ్‌గూడ సర్కిల్ డిప్యుటీ కమిషనర్ జాకియ సుల్తానా ఆధ్వర్యంలో తుది ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ స్థాయిలో ఓటరు జాబితా ప్రక్షాళనపై అధికారులు దృష్టి సారించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుతో ఇప్పటికే ఇక్కడి నుంచి తరలి వెళ్లిన వారితో పాటు వివిధ కారణాలతో నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిన వారి పేర్లు.. మృతి చెందిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఏడాది జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ 1 వ తేదికి 18 ఏండ్లు నిండిన వారి నుంచి ఆన్ లైన్, ఆఫ్ లైన్ లలో దరఖాస్తు లు స్వీకరిస్తూ నాలుగు సార్లు ఓటరు నమోదును చేపడుతున్న ఎన్నికల అధికారులు కొత్త ఓటర్ల పై దృష్టి పెడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన ముమ్మరంగా చేపడుతున్నారు.
జూబ్లీహిల్స్ లో 3,90,864 మంది ఓటర్లు..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 329 పోలింగ్ బూత్‌ల పరిధిలో 3,90,864 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 2,03,406 పురుషులు, 1,87,434 మంది మహిళలు, 24 మంది ఇతరులు ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని అన్ని పోలింగ్ బూత్‌ల పరిధిలో పక్కా ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటరు నమోదు.. సవరణలు చేపట్టనుండటంతో జూబ్లీహిల్స్ ఓటర్లు మరింత పెరగనున్నారు.