హైదరాబాద్: హైదరాబాద్లోని అల్వాల్లో (Alwal) దారుణం చోటుచేసుకున్నది. వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన కనకయ్య, రాజమ్మ దంపతులు అల్వాల్లో నివసిస్తున్నారు. కనకయ్య వాచ్మెన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున తమ ఇంట్లో విగత జీవులుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ టీమ్స్ ఆధారాలు సేకరిస్తున్నారు.
ఒంటిపై గాయాలు ఉండటంతో వారిని కర్రలతో కొట్టి చంపినట్లు గుర్తించారు. దుండగులు మహిళ ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, ఇంట్లోని రూ.లక్ష నగదు చోరీచేసినట్లు బంధువులు తెలిపారు. మృతదేహాలను స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.