ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 13 : ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిష్టిబొమ్మను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దహనం(Effigy burnt) చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో రైతుల భూమిని అక్రమంగా సేకరించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులను అడ్డుకున్నందుకు రైతులతో సహా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేసినందుకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ తన అల్లుడి కోసమే ఫార్మా గిల్లుడు చేస్తున్నారని మండిపడ్డారు.
ఫార్మా సిటీ కోసం కేసీఆర్ సర్కారు సేకరించిన 12 వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నప్పటికి, వాటిని కాదని తన అల్లుడి కోసం ఫార్మాక్లస్టర్‌ల పేరుతో రైతుల భూములు గుంజుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అల్లుడి ఫార్మా కంపెనీ కోసం ప్రజలపై లాఠీ చార్జి చేసి రైతులను జైలుకు పంపుతున్నారని దుయ్యబట్టారు. దీనికి లగచర్ల ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి అనుసరిస్తున్న అడ్డగోలు విధానాలు, ధనదాహంతో కొడంగల్ ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు.
అక్రమంగా అరెస్టు చేసిన రైతులు, మాజీ ఎమ్మెల్యేను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సబ్బండ వర్గాలను హింసిస్తున్న వ్యక్తి రేవంత్ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాపాలన సాగడం లేదని, రాక్షస పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. తక్షణమే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.