సిటీబ్యూరో, జూలై 30(నమస్తే తెలంగాణ) /బన్సీలాల్‌పేట్/ నల్లకుంట/ సుల్తాన్‌బజార్/ నాంపల్లి/ మెహిదీపట్నం/ వనస్థలిపురం/ మల్కాజిగిరి : వైద్య, ఆరోగ్యశాఖలో ఇటీవల జరిగిన బదిలీల ప్రభావం రోగులపై కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నల్లకుంట కోరంటి తదితర టీచింగ్ హాస్పిటల్స్‌లో బదిలీ అయిన ప్రొఫెసర్ల స్థానంలో కొత్తవారు చేరకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఫ్రొఫెసర్ల కొరతతో నగరంలోని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ అన్నీ అసోసియేట్ ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థులే చక్కబెడుతున్నారు.
నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌కు కనీసం సూపరింటెండెంట్ కూడా లేకపోవడంతో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇక ఉస్మానియా, నిలోఫర్ దవాఖానలకు సైతం పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేక పరిపాలనాపరంగా ఇబ్బందులు తప్పడం లేదు. దవాఖానల్లో మందుల కొరత వల్ల వైద్యులు 5రోజులకు మందులు రాస్తే.. అక్కడి ఫార్మసీల్లో కేవలం రెండు లేదా మూడురోజులకు మాత్రమే మందులు ఇస్తున్నారు. అంతే కాకుండా కొన్ని రకాల ఖరీదైన మందులను బయట నుంచి తెచ్చుకోవాలని సూచిస్తున్నట్లు రోగులు వాపోతున్నారు.
గాంధీలో ఓపీకి 3నుంచి 4గంటలు..
గాంధీ దవాఖానలో ఓపీ సేవలు పొందాలంటే కనీసం 3నుంచి 4గంటల వరకు నిరీక్షించాల్సి వస్తోందని రోగులు ఆరోపిస్తున్నారు. మంగళవారం 2,234 మంది రోగులు ఓపీ సేవలు పొందారు. అయితే ఓపీ చీటీ తీసుకోవడానికే కనీసం గంట సేపు క్యూ లైన్లో వేచి చూడాల్సి వస్తోందని రోగులు తెలిపారు. అనంతరం వైద్యుల కన్సల్టేషన్ కోసం మరో గంట నిరీక్షణ తప్పడం లేదని, ఆ తరువాత వైద్యులు రాసిన వైద్యపరీక్షల కోసం శాంపిల్స్ ఇవ్వడానికి మరో గంట, మందుల కోసం ఫార్మసీ వద్ద అరగంట నిరీక్షణ తప్పడం లేదన్నారు. ఓపీ చీటీ తీసుకోవడం దగ్గర నుంచి మందులు తీసుకుని బయటకు వచ్చే వరకు కనీసం 3నుంచి 4గంటల సమయం పడుతుందని రోగులు వాపోతున్నారు.
సగం మందులే..
వైద్యులు 5రోజుల కోర్సు మందులు రాస్తే ఫార్మసీ వారు కేవలం మూడు రోజులకు మాత్రమే మందులు ఇస్తున్నట్లు రోగులు తెలిపారు. ఈ విషయమై ప్రశ్నిస్తే మందులు అందరికీ సరిపోవాలి కదా? అని సమాధానం ఇస్తున్నారు. అంతేకాకుండా వైద్యులు రాసిన కొన్ని రకాల మందులు తమ వద్ద లేవని బయట తీసుకోవాలని సూచిస్తున్నారు.
మూతపడిన రేడియాలజీ
రేడియాలజీ విభాగంలో పనిచేసే ఎనిమిది మంది టెక్నీషియన్లు బదిలీ కావడంతో వారి స్థానంలో కొత్త వారు చేరలేదు. దీంతో గాంధీలో రేడియాలజీ విభాగం పనిచేయడం లేదు. ఫలితంగా అక్కడ ఎక్స్-రే కోసం వస్తున్న రోగులను తరువాత రావాలని తిప్పి పంపుతున్నారు.
ఎంఆర్ఐ, సీటీ స్కాన్‌కు తప్పని నిరీక్షణ..
టెక్నీషియన్స్ సిబ్బంది బదిలీ కారణంగా సీటీస్కాన్, ఎంఆర్ఐ కోసం రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. సిబ్బంది కొరత కారణంగా ఎంఆర్ఐ, సీటీ స్కాన్ కోసం వచ్చే రోగులకు కనీసం వారం నుంచి నెల రోజుల వరకు నిరీక్షణ తేదీని ఇస్తున్నట్లు రోగులు వాపోతున్నారు. ఖరీదైన ఎంఆర్ఐ, సీటీస్కాన్‌లను బయట చేయించుకునే స్థోమత లేకపోవడంతో రోగులు వాటికోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఎంఆర్ఐ, సీటీస్కాన్ నివేదికల ఆధారంగానే చికిత్స చేయాల్సి ఉండటంతో రోగులకు చికిత్సలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
ల్యాబ్‌లో తప్పని తిప్పలు
డయాగ్నోస్టిక్ కేంద్రంలో 8మంది సిబ్బం ది ఉండగా వారిలో ఐదుమంది బదిలీ అయ్యారు. వారి స్థానంలో కొత్తవారు రాలే దు. దీంతో ముగ్గురు మాత్రమే నమూనాలు సేకరిస్తుండటంతో వారిపై తీవ్ర పనిభారం పడటమే కాకుండా రోగులకు గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు.
ఉస్మానియాలో ప్రొఫెసర్ల సీట్లు ఖాళీ..
ఉస్మానియా దవాఖానలో సుమారు 60 మంది ప్రొఫెసర్లు బదిలీ కాగా వారి స్థానంలో ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే చేరారు. దీంతో 59మంది ప్రొఫెసర్ల సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్లు లేకపోవడంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారితో పాటు రోగులకు మెరుగైన చికిత్స కరువైంది. విభాగాలన్నింటికి అసోసియేట్ ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థులే దిక్కయ్యా రు. ఏ విభాగంలో చూసినా అసోసియేట్ల పర్యవేక్షణలో పీజీలే వైద్యసేవలు అందిస్తుండటం కనిపిస్తోంది. డెర్మటాలజీ విభాగంలో ఉన్న ముగ్గురు ప్రొఫెసర్లు బదిలీ ఖాగా వారి స్థానంలో కొత్తవారు రాలేదు. దీంతో అసోసియేట్ ప్రొఫెసర్ పర్యవేక్షణలో పీజీలే వైద్యసేవలు అందిస్తున్నారు. ఆర్థో విభాగంలో నలుగురు ప్రొఫెసర్లు ఉండగా వారిలో ముగ్గురు బదిలీ అయ్యారు. వారి స్థానంలో కొత్త వారు రాకపోవడంతో ఆర్థో సర్జరీలను వాయిదా వేస్తున్నట్లు రోగులు వాపోతున్నారు. మిగిలిన చాలా విభాగాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు.
నిలోఫర్‌లో గర్భిణులు, చిన్నారులకు ఇబ్బందులు..
చిన్నపిల్లల ప్రత్యేక దవాఖానగా పేరుగాంచిన నిలోఫర్‌లో చిన్నారులు, గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. వైద్య శాఖలో జరిగిన బదిలీలతో పలు విభాగాలను అసోసియేట్లు, పీజీ విద్యార్థులే చూసుకుంటున్నారు. నిలోఫర్‌లో మొత్తం 12యూనికట్లకు గాను ఒకేసారి 9మంది ప్రొఫెసర్లు బదిలీ కాగా కేవలం ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రమే ఇతర దవాఖానల నుంచి బదిలీపై నిలోఫర్‌కు వచ్చారు. దీంతో ప్రస్తుతం నిలోఫర్‌లో ఉన్న 12యూనిట్లకు 12మంది ప్రొఫెసర్లు ఉండాలి. కానీ, కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. దీంతో మిగిలిన యూనిట్ల పరిస్థితి కొత్త డాక్టర్లు వచ్చే వరకు ప్రశ్నార్థకమే. ఇదిలా ఉండగా పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేకపోవడంతో సరైన పర్యవేక్షణ లేక కిందిస్థాయిలోని ఆయా విభాగాల్లో సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆర్‌ఎంఓలు లేకపోవడంతో సంబంధిత విభాగాలు అయోమయంగా మారాయి.
జూడాలు, పీజీలే వైద్య సేవలలో కీలకం….
మంగళవారం నీలోఫర్ దవఖానలో ఓపీ వద్ద రోగులు బారులు తీరి కనిపించారు. మొన్నటి వరకు క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా సాంకేతికతను అందిపుచ్చుకున్న నీలోఫర్ దవాఖాన క్యూ ఆర్ కోడ్ యాప్ ద్వారా స్కాన్ చేసుకుని రిజిస్ట్రేషన్ పొందే పద్ధతిని ప్రవేశపెట్టింది. కానీ కొందరికి మొబైల్ ఫోన్ లేకపోగా ఉన్నవారు కూడా ఆ విధానం అర్థంకాక ఆందోళనకు గురవుతున్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలతో జూనియర్ డాక్టర్ల, పీజీ విద్యార్థులే రోగులకు వైద్య సేవలు అందిస్తూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రోగులకు గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదని గర్భిణులు, చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. 15 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల స్థానంలో ప్రస్తుతం 8మంది మాత్రమే ఉన్నారు. ముఖ్యంగా రేడియాలజీ విభాగంలో ఉన్న ఒక్క ప్రొఫెసర్ వికారాబాద్‌కు బదిలీకాగా ఆ స్థానంలో కొత్తవారు రాలేదు. దీంతో స్కానింగ్, ఎక్క్‌రే, సీటీ స్కానింగ్‌ల కోసం రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. వారం నుంచి 15 రోజుల వరకు అపాయింట్మెంట్ డేట్లు ఇస్తున్నట్లు రోగులు వాపోతున్నారు.
ఆ మందులు బయట కొనండి..
చిన్నారులు, గర్భిణులకు, గైనిక్ సంబంధిత సమస్యలతో వచ్చిన వారికి వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా అందించే మందులు సైతం పూర్తి స్థాయిలో లేవని, బయట నుంచి తెచ్చుకోవాలని వైద్యసిబ్బంది సూచిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. నాలుగు రకాల గోళీలు రాసిస్తే అందులో రెండు, మూడు మాత్రమే ఇస్తున్నారని, మిగిలిన వాటిని బయటి నుంచి కొనుగోలు చేయాలని చెబుతున్నట్లు రోగులు తెలిపారు. కాగా సరోజిని కంటి దవాఖానలో సైతం మందుల కొరత కారణంగా కొన్ని రకాల మందులను బయటి నుంచి తెచ్చుకోవాలని సూచిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు.
వనస్థలిపురం ఏరియా దవాఖానలో..
వనస్థలిపురం ఏరియా దవాఖానలో గతంలో వెయ్యి నుంచి 13వందల ఓపీ ఉండేది. ఇప్పుడు 6నుంచి 7 వందలుగా ఉంటోంది. ఫార్మసీలో అన్నిరకాల మందులు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు రాసిన మందులు సగం మాత్రమే ఇస్తున్నారని, మిగతావి బయట తీసుకోవాలని చీటీలో రౌండప్ చేసి మరీ సూచిస్తున్నట్లు రోగులు చెబుతున్నారు.
చీటీల కోసం గంట నిరీక్షించాల్సిందే..
మల్కాజిగిరి జిల్లా దవాఖానలో చీటీల కోసం రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఉదయం 8.30నుంచి చీటీ కోసం లైన్లో ఉంటే 9.15గంటల నుంచి రాస్తున్నారు. రోగులు కూర్చోవడానికి సరిపడ బెంచీలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మల్కాజిగిరిలో 2018 అక్టోబర్ నుంచి 50 పడకలతో ప్రభుత్వ ఏరియా దవఖాన సేవలందిస్తోంది. ప్రతి రోజు దాదాపు 450 నుంచి 550 వరకు రోగులు ఇక్కడ చికిత్స కోసం వస్తుంటారు. మంగళవారం 550 మంది రోగులతో పాటు 20 మంది గర్భిణులు చికిత్స కోసం పేర్లను నమోదు చేసుకున్నారు. దవాఖానలో 21మంది డాక్టర్లకు గాను బదిలీపై 11మంది వెళ్లారు. ప్రస్తుతం 10మంది డాక్టర్లతో చికిత్స అందిస్తున్నారు. రోగుల తాకిడి ఎక్కువగా, వైద్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో చికిత్స కోసం రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. పలు రకాల మందులు లేక పోవడంతో రోగులు బయట మెడికల్ షాపులో కొనాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎక్స్-రే కోసం తిప్పుతున్నారు
నాకు నడుము నొప్పి రావడంతో గాంధీ దవాఖానకు వచ్చా. ఆర్థోపెడిక్ విభాగంలో డాక్టర్ ఎక్స్‌రే తీసుకుని రమ్మన్నారు. అక్కడకు వెళితే యంత్రం పాడైంది రేపు రమ్మని చెప్పారు. నడుము నొప్పితో బస్సులో ప్రయాణం చేసి రావడం, ఖాళీగా తిరిగివెళ్లడం బాధగా ఉంది. పేదవాళ్లం, బయట ప్రైవేట్‌లో చూపించుకోలేము. సర్కారు దవాఖానలో జనం రద్దీ ఎక్కువగా ఉంటున్నది.
– లావణ్య, అంకిరెడ్డి పల్లె, కీసర మండలం
అన్ని మందులు ఇవ్వలేదు
నాకు గుండె నొప్పి రావడంతో గాంధీ దవాఖానకు వచ్చాను. కార్డియాలజీ విభాగంలో డాక్టర్ పరీక్షించి, మందులను వాడమని సిఫారసు చేశారు. ఫార్మసీకి వెళ్లి లైనులో నిలబడ్డాక సగం మాత్రమే ఉన్నాయని చేతిలో పెట్టారు. మిగతా సగం కొనడానికి మా వద్ద డబ్బులు లేవు. గరీబోళ్ల కోసమే కదా ఈ దవాఖాన ఉన్నది ? మరి మందులు లేవు అంటే ఎలా ?
– హసీనా, ముషీరాబాద్
సమస్యలు నా దృష్టికి రాలేదు
నేను వారం రోజుల క్రితమే బదిలీపై ఇక్కడకు వచ్చా. ప్రతిరోజు ఉదయం ప్రధాన భవనం, ఎమర్జెన్సీ, ఐసీయూ వార్డులు, ఓపీ, ఎంసీహెచ్ భవనాలకు వెళ్లి స్వయంగా పరిశీలిస్తున్నా. ప్రభుత్వ పరంగా బదిలీల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. కొత్తవారు వచ్చి విధుల్లో చేరుతున్నారు. ప్రొఫెసర్ల బదిలీ కారణంగా శస్త్ర చికిత్సలపై ప్రభావం లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాం. ఓపీలో మందుల కొరత లేదు. అలాంటిది నా దృష్టికి రాలేదు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నాం.
– డాక్టర్ సీహెచ్.ఎన్.రాజకుమారి, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన