అబిడ్స్, జూన్ 18: అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ అనుబంధ విద్యా సంస్థ అయిన సరోజిని నాయుడు వనితా ఫార్మసీ మహా విద్యాలయ చైర్మన్ డాక్టర్ ప్రభాశంకర్ అధ్యక్షతన మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని గాంధీ సెంటనరీ హాల్లో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల ముగింపు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెనకబడిన ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి పాటు పడుతూ సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ కృషి అభినందనీయమని కొనియాడారు. ఎగ్జిబిషన్ సొసైటీకి అనుబంధంగా ఉన్న విద్యా సంస్థలకు, ఇక్కడి విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని విద్యా సంస్థలను స్థాపించి తెలంగాణలో విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చేపడుతున్న విద్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సొసైటీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు సర్టిఫికెట్లు, మెడల్స్‌ను అందజేసి సత్కరించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు అష్వాక్ హైదర్, డాక్టర్ గంగాధర్‌రావు, బీఎన్ రాజేశ్వర్, జీవీ రంగారెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి హనుమంతరావు, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మమత, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శిరీష, ప్రొఫెసర్ శ్రీనివాస్, కళాశాల కార్యదర్శి సాయినాథ్ దయాకర్ శాస్త్రి, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తదితరులు పాల్గొన్నారు.