Musi Development | సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. మూసీ నదిలో నీటిని స్వచ్ఛంగా ఉంచడంతో పాటు పరివాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం, వాణిజ్య సముదాయాలను నిర్మించడం వంటి దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. రవాణా ఆధారిత అభివృద్ధిపైనా ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు రవాణా పరంగా మహానగరానికి మణిహారంలా మారింది. అలాంటి ఔటర్ రింగు రోడ్డును తూర్పు నుంచి పడమర కలిపే ప్రాజెక్టును మూసీ తీరం వెంబడి చేపట్టడం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించి, ఈస్ట్-వెస్ట్ కారిడార్ ప్రతిపాదనపైనా ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. కేవలం మూసీ సుందరీకరణలో భాగంగా ల్యాండింగ్ స్కేపింగ్ పనులు చేస్తే దానికి ప్రాధాన్యత ఉండదని, రవాణా పరంగా రోడ్డు మార్గంతో పాటు మెట్రో రైలు మార్గాన్ని జత చేయడం ద్వారా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విజయవంతం అయ్యేందుకు అనుకూల వాతావరణం ఉంటుందని నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై సమీక్ష చేసిన సమయంలో హైదరాబాద్ మెట్రో అధికారులతోనూ ప్రత్యేకంగా ఈస్ట్-వెస్ట్ కారిడార్ ప్రాధాన్యతపై ప్రధానంగా చర్చించారు.
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డును నగరం మధ్యలోంచి కలిపేందుకు ఈస్ట్-వెస్ట్ కారిడార్ అత్యంత అనుకూలమైందని గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించి, దీనిపై సమగ్ర అధ్యయాన్ని చేపట్టింది. ప్రాజెక్టును చేపట్టాలన్న లక్ష్యంతో 2018 మార్చి 3న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖను రాసింది. మళ్లీ తాజాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మూసీ తీరం వెంబడి రోడ్డు మార్గంతో పాటు మెట్రో మార్గాన్ని చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన సమీక్షలో మెట్రో మార్గం నిర్మాణంపైనా సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి మెట్రో అధికారులకు సూచించారు. పడమర దిక్కున నార్సింగి ఓఆర్ఆర్ నుంచి మొదలు కొని తూర్పు దిక్కున గౌరెల్లి వద్ద ఓఆర్ఆర్ను మూసీ మీదుగా రోడ్డు, మెట్రో మార్గం నిర్మాణ సాధ్యాసాధ్యాలపై వెంటనే అధ్యయనం చేసేందుకు మెట్రో అధికారులు సిద్ధమయ్యారు. రవాణా ఆధారిత అభివృద్ధి అనే నినాదాన్ని మూసీ తీరంలో విజయవంతం చేసేందుకు ఉన్న అవకాశాలను గుర్తించనున్నారు. మూసీ సుందరీకరణ తర్వాత పర్యాటకంగా కేంద్రంగా ఆదరణ ఉండాలంటే రోడ్డు, మెట్రో రైలు కనెక్టివిటీ చాలా కీలకంగా మారుతుందని ప్రాథమికంగా నిర్ణయించారు. త్వరలోనే మెట్రో అధికారులు మూసీ వెంబడి ఈస్ట్-వెస్ట్ కారిడార్‌కు సంబంధించి క్షేత్ర స్థాయిలో ప్రాథమిక అధ్యయనం పనులు చేపట్టనున్నారు. దీనిపై ప్రభుత్వం సమగ్రంగా సమీక్షించిన తర్వాత డీపీఆర్‌ను రూపొందించేందుకు అవకాశముంటుందని మెట్రో అధికారి ఒకరు తెలిపారు.