Hyderabad | వెంగళరావునగర్, మార్చి 7 : ఆన్లైన్ క్లాస్ ట్రయల్ చూసి నచ్చితేనే చేరండి అంటూ నమ్మించారు. క్లాసులో ఉండగా కంప్యూటర్ రిమోట్ యాక్సెస్ ద్వారా మహిళ డాక్యుమెంట్లను సింప్లీలెర్న్ సంస్థ నిర్వాహకులు తీసుకున్నారు. కంప్యూటర్లోని ఆమె ఫొటోల్ని రహస్యంగా కాజేశారు. అయితే తనకు క్లాస్ నచ్చలేదని, జాయిన్ కావడం ఇష్టం లేదని బాధితురాలు తెలిపింది. అవేమీ వినిపించుకోకుండా.. రూ.45 వేలు కట్టాల్సిందేనని ఒత్తిడి చేశారు. డబ్బు ఇవ్వకుంటే నీ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దాంతో ఆందోళనకు గురైన బాధితురాలు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసుల కథనం ప్రకారం ఎస్ఆర్ నగర్లోని లేడీస్ హాస్టల్లో నివాసం ఉండే ఓ మహిళ (42) యూఎస్ బేస్డ్ కంపెనీలో హెచ్ఆర్గా ఉద్యోగం చేస్తుంటారు. గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన బిజినెస్ అనలిస్ట్ సర్టిఫికేషన్ కోర్సు కోసం బెంగుళూరుకు చెందిన సింప్లీలెర్న్ అనే ఈ-లెర్నింగ్ సంస్థకు అప్లై చేసింది. ఆ సంస్థ తమ ఫైనాన్స్ పార్ట్నర్ ఎఫ్ఐబీకి అప్పగించారు. అదేరోజు ఎఫ్ఐబీ అనే సంస్థ ఆమె నుంచి వివరాలన్నీ సేకరించింది.
అకౌంట్ డిటైల్స్, ఆధార్, పాన్ కార్డ్ తదితర వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సంస్థ ప్రతినిధికి వివరాల్ని షేర్ చేసింది. గతేడాది సెప్టెంబర్ 28వ తేదిన కోర్సు ట్రయల్ చూసి.. నచ్చితేనే జాయిన్ ఆవ్వాలని.. ఆన్ లైన్ క్లాస్ నచ్చకపోతే జాయిన్ కావాల్సిన అవసరం లేదని ఆమెని ఒప్పించి గంట సేపు ఆన్లైన్ క్లాస్లో ఉంచారు. మహిళకు చెందిన కంప్యూటర్ రిమోట్ యాక్సెస్ తీసుకుని ఆమెకు చెందిన డాక్యుమెంట్లను తీసుకొన్నారు. రహస్యంగా ఆమె ఫోటోల్ని కంప్యూటర్ నుంచి సేకరించారు.
తనకు క్లాస్ నచ్చలేదని.. అడ్మిషన్ క్యాన్సిల్ చేయాలని పలుమార్లు ఈ మెయిల్స్ ద్వారా మహిళ వాళ్లకు తెలిపింది. అడ్మిషన్ క్యాన్సిల్ చేసేదే లేదని. రూ.45 వేలు డబ్బు కట్టాల్సిందేనని ఖరాఖండిగా చెప్పారు. డబ్బు ఇవ్వకుంటే నీ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని విద్యార్థినిని బెదిరించారు. దాంతో ఆందోళనకు గురైన బాధిత మహిళ గురువారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.