E-Cigarettes | చార్మినార్, మార్చ్ 5 : నిషేధిత ఈ సిగరెట్ అమ్మకాలను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డిసిపి అందే శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే వికారుద్దీన్ అలియాస్ మహమ్మద్ (28) హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన తన బాల్య స్నేహితుడు గోయల్‌తో కలిసి నిషేధిత ఈ సిగరెట్ అమ్మకాలను చేపడుతున్నాడు.
నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ వంటి వివిధ బ్రాండ్లతో పాటు ఎల్ఫ్బార్ 6000 పఫ్‌లు, ఎల్ఫ్బార్ 20000 పఫ్‌లు, ఆలివ్బార్ 15000 పఫ్‌లు, ఎల్ఫ్బార్ 30000 పఫ్‌లు, ఐజెట్ 10000 పఫ్స్ నిషేధిత విక్రయాలు చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో నిందితుని ఇంటిపై దాడి చేసి ఈ సిగరెట్ అమ్మకాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఢిల్లీకి చెందిన రాహుల్ అనే వ్యక్తి నుండి ఈ-కార్ట్ కొరియర్ సర్వీస్ ద్వారా నిషేధించబడిన ఈ-సిగరెట్లను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించామని శ్రీనివాసరావు తెలిపారు.
అధిక ధరలకు వినియోగదారులకు విక్రయించి, అక్రమంగా భారీ లాభాలను పొందుతున్నాడని తెలిపారు. గోయల్‌తో పాటు ఈ- సిగరెట్లు సరఫరా చేసిన రాహుల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం కాలపత్తర్ పోలీసులకు అప్పగించామని తెలిపారు. ఈ దాడుల్లో సౌత్-ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్. సైదాబాబు, ఎస్ఐ ఎం. మధు, ఎస్కే కవియుద్దీన్, పి. సాయిరామ్ తోపాటు కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.