సిటీబ్యూరో: దసరా పండుగ దృష్ట్యా ఇటు తెలంగాణ, అటు ఏపీలోని ప్రాంతాలకు నగరవాసులు వెళ్లడానికి పోటీపడుతున్నారు. ఓ వైపు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నప్పటికీ వాటి సంఖ్య సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు ఇతర మార్గాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ప్రైవేటు వాహనాలు సైతం ప్రయాణికుల వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తూ దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో నగర ప్రయాణికులు ఇప్పుడు కార్పూలింగ్ సేవలను విరివిగా వినియోగిస్తున్నారు.
అందుబాటులో ఉన్న కార్ పూలింగ్ యాప్లతో వెళ్లాల్సిన గమ్యస్థానాన్ని ఎంచుకుంటున్నారు. క్విక్రైడ్, పూల్ ఇట్, టోటోపూల్, రైడ్ మేట్స్, యస్ రైడ్, బ్లాబ్లా కార్, జిఫీ వంటి యాప్లు కార్ పూలింగ్ సేవలను అందిస్తున్నాయి. ఏదైన వాహనంలో మనం ప్రయాణం చేస్తే ఈ యాప్లో కార్ నంబర్, ప్రయాణించే రూట్ వివరాలను యాప్లో నమోదు చేస్తే.. ఆ మార్గంలో వెళ్లాలనుకునే ప్రయాణికులను కనెక్ట్ చేస్తుంది. ఈ విధానంతో చాలా మంది కార్ పూలింగ్ యాప్ సేవలను వినియోగించుకుంటూ గమ్యస్థానాలు చేరుకుంటున్నారు.