కాప్రా, సెప్టెంబర్ 20: పదేండ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ అద్భుతమైన ప్రగతిని సాధించిందనీ, విఘ్నేశ్వరుడి ఉత్సవాలకు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ నిలుస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. శుక్రవారం రాత్రి ఏఎస్‌రావునగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి వద్ద ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇటీవల వచ్చిన వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజల కష్టాలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో సాధించిన ప్రగతి దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలను కష్టాల నుంచి కాపాడాలని ఆ విఘ్నేశ్వరుడిని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గన్‌మెన్ లేకుండానే ప్రజల కోసం రోజంతా తిరుగుతూ కష్టపడే తత్వమున్న డైనమిక్ లీడర్ అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని అభినందించారు.
నిమజ్జనానికి తరలివెళ్తున్న యువసేన భారీ గణపతిని చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. అనంతరం హరీశ్‌రావు ఏఎస్‌రావునగర్ డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బీఆర్ఎస్ నాయకులు కాసం మహిపాల్‌రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.