సిటీబ్యూరో, మే 21(నమస్తే తెలంగాణ): ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడంలేదన్న విషయం తేటతెల్లమైంది. జిల్లాలోని 14 సర్వీస్ సెంటర్లు, ఓ జిల్లా ఆసుపత్రిలో ప్రసవాలు జరగాల్సి ఉండగా, వాటిలో కేవలం బార్కాస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కింగ్ కోటి జిల్లా ఆసుపత్రి మాత్రమే ముందంజలో ఉండగా.. మిగతా ఆసుపత్రుల్లో అనుకున్న స్థాయిలో ప్రసవాలు జరగడం లేదు.
గత నెలలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్వీస్ సెంటర్లు, కింగ్ కోఠి ఆస్పత్రితో కలిపి 967 ప్రసవాలు జరగగా.. వాటిలో 387 మందికి సిజేరియన్లు జరగడం ఆందోళన కలిగిస్తుంది. సిజేరియన్లు తగ్గించడంలో ప్రభుత్వం, వైద్యాధికారులు ఏ మాత్రం చొరవ తీసుకోవడం లేదన్నది పెరుగుతున్న సిజేరియన్లను చూస్తేనే అవగతమవుతుంది.
మిగతా వాటి పరిస్థితేంటి..?
బస్తీవాసులు, పేద ప్రజలకు సాధారణ ప్రసవాలు, 24గంటలు వైద్యసేవలు అందించేందుకు కేసీఆర్ సర్కారు ఎంతో కృషి చేసింది. అందులో భాగంగానే జిల్లాలో 14 సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఇందులో ప్రసవాలకు కావాల్సిన పరికరాలు, ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. అధికారంలో ఉన్నన్ని రోజులు పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఎప్పటికప్పుడు వాకబు చేసింది. గాంధీ, ఉస్మానియా, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ లకు ప్రసవాల సంఖ్య పెరుగుతుండటంతో సర్వీస్ సెంటర్లలోనే సాధారణ ప్రసవాలు జరిగేలా సిబ్బందిని నియమించింది. నిత్యం ప్రసవాలతో రద్దీగా ఉండే దవాఖానలు నేడు వెలవెలబోతున్నాయి.
జిల్లాలోని బొరబండ, అరాజ్పెంట, పురునాపుల్-1, యాకత్పురా-1, దారుల్షిఫా, చార్మినార్, డాక్టర్ పాల్‌దాస్, గగన్ మహల్, బేగంపేట ప్రాంతాల్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సర్వీస్ సెంటర్లలో గతంలో ప్రసవాలు అనుకున్న స్థాయిలో జరుగుతుండగా.. నేడు అంతంత మాత్రమే జరుగుతుండటం గమనార్హం. గత నెల కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో 160 ప్రసవాల్లో 24శాతం మందికి సిజేరియన్లు జరిగాయి. బార్కాస్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 60 మందికి ప్రసవాలు జరగగా 23 మందికి సిజేరియన్లు చేశారు. జిల్లాలో సిజేరియన్లు తక్కువగా అయిన వాటిల్లో కింగ్ కోఠి, బార్కాస్లు ఉండటం విశేషం. మిగతా వాటిల్లో మాత్రం పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటం గమనార్హ ం.
పేరు మార్చి నిలిపేశారు..
సాధారణ ప్రసవాలు పెంచేందుకు కేసీఆర్ సర్కారు గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టింది. తల్లిబిడ్డల ఆరోగ్యం కోసం కేసీఆర్ కిట్‌ను ప్రవేశపెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే వారికి ఉచితంగా కిట్‌ను అందించింది. పేదలకు వరంగా మారిన కేసీఆర్ కిట్ ప్రభుత్వ వైద్య సేవలను గుండెలకద్దుకునేలా చేసింది. ఆ ప్రభావంతో ఆశాలు నెలలో 6 వరకు ప్రసవాల కేసులు నమోదు చేయించి కేసీఆర్ కిట్‌ను అందించేవారు. కాంగ్రెస్ రాకతో కేసీఆర్ కిట్ పేరును మార్చి, ఎంసీహెచ్ కిట్‌గా పేరు మార్చింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎంసీహెచ్ కిట్లు ఇవ్వగపోగా, ప్రసవాలు కూడా తగ్గడం గమనార్హం. సర్వీస్ సెంటర్ల లక్ష్యానికి తూట్లు పొడిచే దిశగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో మాదిరిగానే నెలలో డెలవరీల నమోదు టార్గెట్ ప్రకారం చేయాలని మెడికల్ అధికారులు ఆదేశాలు ఆశాలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎంసీహెచ్ కిట్ లేకపోవడం కారణంగా సర్వీస్ సెంటర్లకు వచ్చేందుకు బాధితులు అయిష్టంగా ఉన్నారు.