హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో (Exhibition Grounds) ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి దాండియా కార్యక్రమం నిర్వహించారు. అయితే అర్ధరాత్రి సమయంలో కరంట్ కట్‌చేసి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి విగ్రహం చేతిని విరగొట్టారు. పూజా సామాగ్రిని చిందరవందరగా పడేశారు. అమ్మవారి చుట్టూ ఉన్న బారికేడ్స్‌ను తొలగించారు.
శుక్రవారం ఉదయం గుర్తించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. అబిడ్స్ ఏసీపీ చంద్ర శేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రతి ఏటా ఇలాగే దుండగులు హిందూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం ధ్వంసం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.