మూసీకి జీవం పోస్తామంటూనే.. మరణశాసనాన్ని లిఖిస్తున్నది కాంగ్రెస్ సర్కారు. నది జన్మస్థలమైన వికారాబాద్‌లోనే మూసీ కలుషితమవుతున్నది. నేరుగా మురుగునీరు కలుస్తున్నది. రూ.లక్షన్నర కోట్లు పెట్టి మూసీని సుందరీకరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఒకవైపు గప్పాలు కొడుతున్నారు కానీ.. పాడైపోయిన యంత్రాలకు మరమ్మతులు చేయించేందుకు ఇప్పటికీ రూపాయి కేటాయించపోవడం దారుణమని పర్యావరణవేత్తలు అంటున్నారు. మూసీనదిలోకి వికారాబా ద్ పట్టణంలోని మురుగునీటిని శుద్ధి చేయకుండానే వదులు తుండడంతో దాని పరీవాహక ప్రాంతంలోని రైతులు దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వికారాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ మున్సిపాలిటీలోని ఎస్టీపీ (సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) గత 12 నెలలుగా పనిచేయకపోవడంతో మురుగునీటి శుద్ధి ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో వికారాబాద్ మున్సిపాలిటీ నుంచి వచ్చే మురుగు నీరంతా నేరుగా మూసీనది లో కలుస్తుండడంతో.. దాని పరీవాహక ప్రాంతంలోని రైతులు దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా జంట జలాశయాల్లోని ఒకటైన ఉస్మాన్‌సాగర్‌లోకి కూడా వికారాబాద్ మున్సిపాలిటీ డ్రైనేజీ నీరు కలుస్తుండడం బాధాకరం.
గతంలో కేవలం హైదరాబాద్‌లోనే మురుగునీటితో కలుషితమయ్యే మూసీనది… కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య వైఖరితో మూసీ జన్మస్థలం వద్దే మురుగు నీరు కలుస్తుండడంపై స్థానికులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కేంద్రంలో పాడైన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్‌లో పర్యటించిన సందర్భంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేతో కలిసి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను సందర్శించి, మురుగునీటి శుద్ధి ప్ర క్రియ ఎందుకు నిలిచిపోయిందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని మూసీలోకి డ్రైనేజీ నీరు వెళ్తుండడంతో ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.
ఏడాదిగా పనిచేయని ఎస్టీపీ..
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీపీ(సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ఏడాదిగా పనిచేయడం లేదు. దాని యంత్రాలను బాగు చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఏడాదిగా ఒక్క రూపాయీ విడుదల చేయకపోవడంతో ఎక్కడిక్కడ నిలిచిపోయింది. ఏడాదిగా సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేయకపోవడంతో ప్రస్తుతం ఎస్టీపీకి సంబంధించిన యంత్రాలు తుప్పుపట్టే దశకు చేరుకున్నాయి.