సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలి.. 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.. అనే ప్రధాన డిమాండ్లతో డీఎస్సీ అభ్యర్థులు సాగిస్తున్న నిరసన సెగ రెండో రోజూ కొనసాగింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు పట్టువీడని విక్రమార్కుల్లా నిరుద్యోగులు ఆందోళన బాట వీడలేదు. సోమవారం ఉదయం లక్డీకాపూల్‌లోని విద్యాశాఖ డైరెక్టరేట్ వేదికగా నిరుద్యోగులు మొదలుపెట్టిన నిరసన రాత్రి… పగలు అనే తేడా లేకుండా సాగింది. సోమవారం రాత్రి పేట్లబురుజులోని సిటీ ఆర్మ్ రిజర్వుడ్ హెడ్‌క్వార్టర్స్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అభ్యర్థులు అర్ధరాత్రి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు.
ముఖ్యంగా మహిళా అభ్యర్థులు సైతం మంచినీళ్లు, తిండి లేకుండా… పది కిలోమీటర్లకు పైగా నడిచి మరీ క్యాంపస్ చేరుకున్నారు. కొందరు విద్యార్థినులు కాళ్లకు చెప్పులు లేకుండానే నగర రోడ్లపై నడుచుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ రాత్రంతా తమ నిరసనను కొనసాగించారు. అనంతరం మంగళవారం ఉదయం తిరిగి మళ్లీ పోలీసులు యూనివర్సిటీకి వచ్చి నిరుద్యోగులను అరెస్టు చేశారు. ఇలా దాదాపు 36 గంటల పాటు నిద్రాహారాలకు దూరమై… పోలీసుల అరెస్టులతో నీరసించిపోయారు. కాగా మంగళవారం ఉదయం ఓయూ క్యాంపస్‌లో వందలాది మంది పోలీసులు డీఎస్సీ అభ్యర్థుల కోసం జల్లెడ పట్టి అరెస్టు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.