సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్లోని 5ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో పట్టుబడిన రూ.65.40లక్షల విలువైన గంజాయి, డ్రగ్స్‌ను శుక్రవారం ఆబ్కారీ అధికారులు కాల్చివేశారు. చార్మినార్ , ధూల్ పేట్ , ముషీరాబాద్, నాంపల్లి, నారాయణగూడ ఎక్సైజ్ పొలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 47 కేసుల్లో మొత్తం 121.36కిలోల గంజాయి, 1.40కేజీల హషిష్ ఆయిల్ వంటి మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. దీంతో డిస్పోజల్ అధికారి, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శ్రాస్తీ అదేశాల మేరకు శుక్రవా రం ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో షాద్‌నగర్‌లోని జీజే మల్టీకౌవ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గంజాయిని, డ్రగ్స్‌ను దహనం చేశారు. దహనం చేసిన డ్రగ్స్ విలువ 65.90 లక్షలుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ దహన ప్రక్రియలో ఎస్ఐలు శ్రవణ్ కుమార్, రమేశ్ బాబు, సూర్య ప్రకాశ్, శివకృష్ణ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
సిటీబ్యూరో, మార్చి 7, (నమస్తే తెలంగాణ): విదేశాల్లో సాగయ్యే సువాసన కలిగిన ఓజీ కుష్(హైబ్రిడ్ గంజాయి) విక్రయిస్తున్న వ్యక్తిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.1.40లక్షల విలువ చేసే 33.26 గ్రాముల ఓజీకుష్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ సీఐ నాగ రాజు కథనం ప్రకారం…విదేశాల నుంచి బెంగూళూరు, ఢిల్లీ ప్రాంతాలకు సరఫరా అయ్యే ఓజీ కుష్‌ను ఎక్కువ రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన వారు వినియోగిస్తారు. ఈ మత్తు పదార్థాన్ని హైదరాబాద్‌లో గ్రామ్‌కు రూ.4వేల నుంచి రూ.5వేల చొప్పున విక్రయిస్తారు. ఈ క్రమంలో ఎండీ సాజిద్ రాజస్థాన్ నుంచి తక్కువ ధరకు ఒజీకుష్ను కొనుగోలు చేసి మేడ్చల్ జీడిమెట్ల ప్రాంతంలో విక్రయిస్తున్నాడు. సమాచా రం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఎండీ మోహినుద్దీన్ సూచన మేరకు కమీషన్ ప్రాతిపదికన మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు.