సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): కొరియర్లో మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయంటూ బెదిరించి ఆన్లైన్ ద్వారా రూ.93,643లు తస్కరించిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఒక యువతికి గతనెల 24న గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము ముంబైలోని ఫెడెక్స్ కొరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరు, ఫోన్నంబర్తో మీకు ఒక కొరియర్ పార్శిల్ వచ్చిందని చెప్పారు.
అందులో డ్రగ్స్ ఉన్నట్లు తేలడంతో వాటిని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటూ యువతికి చెప్పారు. అంతేకాకుండా.. విచారణ నిమిత్తం ఫోన్‌కాల్‌ను సైబర్‌క్రైమ్ పోలీసులకు కనెక్ట్ చేస్తున్నట్లు చెప్పి మరో వ్యక్తితో కాల్ మాట్లాడించారు. సదరు వ్యక్తి తన పేరు స్నుతా పాటిల్‌గా పరిచయం చేసుకుని.. తాను ముంబై సైబర్‌క్రైమ్ నుంచి మాట్లాడుతున్నట్లుగా చెప్పాడు. స్కైప్ ద్వారా వీడియోకాల్ చేసి తన బ్యాక్ ఖాతాలను పరిశీలించాలని చెప్పాడు. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలో కొంత డబ్బు వేయాలని, ఆ డబ్బు విచారణ తరువాత తిరిగి మీ ఖాతాలోకి బదిలీ చేస్తామని నమ్మించాడు. దీంతో బాధిత యువతి సదరు వ్యక్తి చెప్పినట్లుగానే రూ.93,643లను అతడి ఖాతాకు బదిలీ చేసింది. ఆ తర్వాత డబ్బు తిరిగి తన ఖాతాలోకి రాకపోవడంతో బాధితురాలు సదరు వ్యక్తులకు ఫోన్ చేయగా నాట్ రీచబుల్ అని వచ్చింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.