సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు తాజాగా మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఈ కేసులో రూ.2కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఒక యువతితో పాటు ఏపీకి చెందిన ఒక కానిస్టేబుల్ సహా మొత్త ఐదుమంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే…. కూకట్‌పల్లిలోని వివేకానందనగర్ కాలనీ ప్రాంతంలో ఒక ముఠా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఐదుమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుల వద్ద రూ.2కోట్ల విలువ చేసే 841గ్రాముల కొకైన్, కొకైన్ మిక్చర్ డ్రగ్స్ లభించినట్లు తెలిసింది. అరెస్టు చేసిన వారిలో యువతితో పాటు ఏపీలోని తిరుపతి ప్రాంతానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నటు సమాచారం.
డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2.4గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను పట్టుకున్నా రు. ఎస్టీఎఫ్ ఈఎస్ అంజిరెడ్డి కథనం ప్రకారం…నగరానికి చెందిన ప్రేమ్‌కుమార్, శరత్‌కుమార్‌లు బెంగుళూరుకు చెందిన నితీష్అరుణ్రాజ్ వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి.. నగరంలో విక్రయిస్తారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు సోమవా రం మల్కాజిగిరి ప్రాంతంలో డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తున్న ప్రేమ్‌కుమార్, శరత్‌కుమార్‌లను అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి 2.4గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నితీశ్అరుణ్రాజ్పై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.