హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. చందానర్ గుల్మొహర్‌లోని ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీకి కొందరు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి పక్కాసమాచారం అందుకున్న పోలీసులు ఆ వైద్యుడి ఇంటిపై దాడి చేశారు. దీంతో 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుబడింది. దాని విలువ రూ.18 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఐదుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కాగా, రెండు రోజుల క్రితం నగరంలోని జీవీ సులూజా దవాఖానల్లో భారీగా నార్కోటిక్స్ డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. అక్టోబర్ 30న హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పలు హాస్పిటళ్లలో ఎక్సైజ్, డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మౌలాలీలోని నేహా భగవత్ నివాసంలో సోదాలు నిర్వహించి నార్కోటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతనితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
ఇక సులూజా దవాఖానలో పెద్ద మొత్తంలో మత్తు మందును నిల్వచేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా వాటిని దిగుమతి చేసి హాస్పిటల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన నేహా భగవత్ సహాయంతో మత్తుమందులు అమ్ముతున్నారని అధికారులు వెల్లడించారు.