మాదాపూర్, నవంబర్ 13: ముంబై నుంచి ఎండీఎంఏ నార్కోటిక్ డ్రగ్స్‌ను తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు హోటల్ వెస్టిన్ సమీపంలో సేవించేందుకు ప్రయత్నిస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు శనివారం అక్కడకు చేరుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన ప్రకారం, మహమ్మద్ బీన్ హసాన్ కోలాని (50) పాతబస్తీలోని చార్మినార్ వద్ద నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. మరో వ్యక్తి కొండ్లె రాకేష్(39) లక్డీకాపూల్ ఎర్రమంజీర్ కాలనీలోని సౌదా అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటూ క్లౌడ్ ఇంజనీర్‌గా చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి రెండు రోజుల క్రితం ముంబైలోని ఓ వ్యక్తి వద్ద ఒక్కో ప్యాకెట్ 1 గ్రాము బరువుతో ఉన్న 3 గ్రాముల ఎండీఎంఏ నార్కోటిక్ డ్రగ్స్‌ను కొనుగోలు చేశారు. మాదాపూర్‌లోని హోటల్ వెస్టిన్ సమీపంలో సేవించేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారి ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 3 గ్రాముల డ్రగ్స్‌తో పాటు రూ.16 వేల నగదు, మొబైల్ ఫోన్స్ 3, హ్యుండాయ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.