హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. యూనివర్సిటీకి చెందిన 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ ఫోర్స్మెంట్ (ఈగల్) గుర్తించింది. వారందరికీ నిర్వహించిన పరీక్షల్లో 18 మందికి పాజిటివ్ వెల్లడించారు.
విశ్వసనీయ సమాచారం ఈనెల 25న జీడిమెట్ల సురారంలోని శివాలయం కాలనీలో పోలీసులు సో దాలు నిర్వహించి నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్, ఇతర డ్రగ్ ప్యాకేజింగ్ సామగ్రి, ఒక తూకం యంత్రం, డ్రగ్స్ రవాణాకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దర్యాప్తులో అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లింగ్ రాకెట్ మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. మాల్నాడు రెస్టారెంట్ కేసు విచారణలో భాగంగా, కొరియర్ ద్వారా డ్రగ్స్ పార్సిల్స్ రవాణా అవుతున్నట్లు ఈగల్ టీమ్ నిఘా పెట్టింది. మారుతి కొరియర్స్ ఫ్రాంఛైజ్ అయిన రాజేశ్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా డ్రగ్స్ పార్సిళ్లు బుక్ అవుతున్నట్లు ఈగల్ బృందం గుర్తించింది. ఢిల్లీలోని ఒక నైజీరియన్ రెండు పార్సిళ్లను యూనివర్సిటీ విద్యార్థి దినేశ్‌కు పంపినట్లు తెలుసుకున్నది.
మరో విద్యార్థి భాసర్ అదే నైజీరియన్ అయిన నిక్కు ఫోన్ పే ద్వారా రూ.9వేలు, ఏటీఎం క్యాష్ డిపాజిట్ ద్వారా రూ.8వేలు చెల్లించాడు. ఈ విద్యార్థులు రెండుసార్లు 4 ఎండీఎంఏ మాత్రలను స్వీకరించి, తమ స్నేహితులతో కలిసి క్వేక్ అరేనా పబ్‌లో సేవించారని గుర్తించారు. కూపీ లాగడంతో మహీంద్రా యూనివర్సిటీలోని డ్రగ్స్ దందా బయటపడింది. ఈగల్ బృందాలు సోదాలు చేపట్టి ఇద్దరు విద్యార్థులను గుర్తించారు.