Drug Peddler Arrest | మాదాపూర్ : మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఇద్దరిని డీటీఎఫ్ శంషాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఏఈఎస్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని మల్లా జిల్లాకు చెందిన నిందితుడు అలియుల్ (27) గంజాయి సరఫరా చేస్తున్నాడు. ఉత్తర బెంగాల్ మాల్డాకు చెందిన ఏ2 నిందితుడు నసిముల్ (27) బ్రౌన్ షుగర్, హెరాయిన్ విక్రయిస్తున్నాడు. ఈ నెల 10న రాత్రి సమయంలో అలియుల్ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో గ్రాముకు రూ.1500 చొప్పున పలు డ్రగ్స్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్ గచ్చిబౌలిలోని నానాక్రాంగూడకు చేరుకున్నాడు.
పలువురు డ్రగ్ వినియోగదారులకు గ్రాముకు రూ.5వేల చొప్పున విక్రయించేందుకు.. కాలనీలోని నసిముల్కు అందజేశారు. ఈ క్రమంలో శంషాబాద్ డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఈఎస్ శంషాబాద్ కృష్ణప్రియ ఆదేశాల మేరకు శంషాబాద్ డీటీఎఫ్ బృందం నానకక్రామ్గూడలోని సముధర ఒలింపస్ లేబర్ కాలనీలో నివాసంపై డీటీఎఫ్ బృందం దాడి చేయగా.. వారి వద్ద హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు. దాంతో వారి వద్ద నుంచి 41 గ్రాముల బ్రౌన్ షుగర్‌తో పాటు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. దాడుల్లో డీటీఎఫ్ బృందం ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది ఫక్రుద్దీన్, మల్లేశ్, నెహ్రూ, నిఖిల్, శంకర్, శేఖర్ ఉన్నారు.