ఖైరతాబాద్, ఫిబ్రవరి 7: డ్రగ్స్ పెడ్లర్ స్టాన్లీ అంతర్జాతీయంగా మత్తు సామ్రాజ్యాన్నే స్థాపించాడు. మంగళవారం టీఎస్ న్యాబ్, హెచ్‌న్యూ, పంజాగుట్ట పోలీసులు స్టాన్లీని అరెస్టు చేసి.. రూ.8 కోట్ల విలువజేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అతడి వ్యక్తిగత జీవితంతో పాటు నేర సామ్రాజ్య విస్తరణపై పోలీసుల దర్యాప్తులో అనేక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నైజీరియాకు చెందిన 43 ఏండ్ల ఇవులా ఉకోడా స్టాన్లీ 2009లో భారత్‌లో అడుగు పెట్టాడు. ముంబైలో జూవెల్ అనే వ్యక్తి సాయంతో రెడీమేడ్ బట్టల వ్యాపారాన్ని ప్రారంభించి, అక్కడి నుంచి గోవాలోని కండోలిమ్‌కు చేరుకున్నాడు. తోటి నైజీరియన్లను పరిచయం చేసుకొని డ్రగ్స్ దందాను నేర్చుకున్నాడు. తొలుత గోవాకు వచ్చే పర్యాటకులు, సందర్శకులకు డ్రగ్స్‌ను విక్రయించడం ప్రారంభించాడు. గత 15 ఏండ్ల కాలంలో మత్తు పదార్థాల విక్రయం, సరఫరా చేస్తూ దేశ, విదేశాలకు తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
బిజినెస్ వీసాపై వచ్చి గోవాలోనే మకాం పెట్టిన అతడిని 2012లో గోవాలోని మపూజా పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అతడికి రాజస్థాన్‌కు చెందిన ఉషా చండేల్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆమెను 2014లో పెండ్లి చేసుకున్నాడు. ఇద్దరు కలిసి చిన్న కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. డ్రగ్స్ వ్యాపారం చేసే ఇద్దరు నైజీరియన్లు స్టాన్లీ దుకాణం వద్దకు నిత్యం రావడంతో వారితో పరిచయం పెరిగి చివరకు డ్రగ్స్ వ్యాపారంలో భాగస్వామిగా మారాడు. వినియోగదారులకు డ్రగ్స్ సరఫరా చేసే స్థాయి నుంచి సొంతంగా పలువురు ట్యాక్సీ డ్రైవర్లు, ట్రాన్స్పోర్టర్ల సాయంతో డ్రగ్స్ కొనుగోలు, విక్రయాల దందా ప్రారంభించాడు. 2017లో డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్న స్టాన్లీని గోవా ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ కేసులో సెంట్రల్ జైలుకు వెళ్లాడు. విడుదలైన తర్వాత దేశంలోనే.. విదేశాలకు కూడా డ్రగ్స్ సరఫరా చేయడం ప్రారంభించాడు.
స్టాన్లీ వ్యక్తిగత జీవితం చూసి పోలీసులు విస్తుపోయారు. స్టాన్లీకి గోవాలోని కండోలిమ్‌లో విలాసవంతమైన భవనంతో పాటు కోట్లాది రూపాయల విలువైన కారు, ఇతర వస్తువులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం భార్యా పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు. స్థానికులకు ఓ సామాన్యు గ్రోసరీ వ్యాపారిగా కనిపించే స్టాన్లీ.. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ దందా చేస్తూ వందల కోట్లు సంపాదించాడని చెబుతున్నారు.
స్టాన్లీ వద్ద స్వాధీనం చేసుకున్న రూ.8 కోట్ల విలువైన మత్తు పదార్థాలలో ఓజీ వీడ్ అత్యంత ఖరీదైన డ్రగ్ అని పోలీసులు తెలిపారు. ఈ ఓజీ మత్తు పదార్థం అమెరికాలో మాత్రమే సాగవుతుందని తెలిపారు. గంజాయి జాతికి చెందిన ఈ మత్తు పదార్థం ఒక్క గ్రాము ధర రూ. ఐదువేలకు పలుకుతుందని పోలీసులు తెలిపారు. దీనిని ఎక్కువగా సినీ, రాజకీయ ప్రముఖులు వినియోగిస్తారని సమాచారం. స్టాన్లీ కస్టమర్లను గుర్తించేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.