సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): గంజాయి డాన్ నీతూబాయి ఇంటిపై శనివారం మున్సిపల్ అధికారులు దాడులు జరిపారు. నానక్‌రాంగూడలోని లోథాబస్తీలో ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన కిరాణ దుకాణం, రేకుల షెడ్డును మున్సిపల్ అధికారులు కూలగొట్టారు. ఈ కిరాణం దుకాణం ముసుగులోనే నిందితురాలు గంజాయి విక్రయాలకు పాల్పడుతుండడంతో గుర్తించిన ఈగల్ బృందం.. గతంలోనే మున్సిపల్ అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది.
ఆక్రమిత కిరాణ దుకాణంలో గంజాయి దందా జరుపుతున్న నీతూబాయిపై ఇటీవలే ఈగల్ పోలీసులు దాడులు జరిపి, గంజాయి కొనుగోలు కోసం వచ్చిన సుమారు 47 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల రాకను గమనించి నీతూబాయి అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లింది. అయితే నిందితురాలి ఆక్రమిత నివాసం, కిరాణా దుకాణాన్ని తొలగించాల్సిందిగా ఈగల్ బృందం మున్సిపల్ అధికారులపై మరోసారి ఒత్తిడి తీసుకురావడంతో శనివారం మున్సిపల్ అధికారులు నిందితురాలి ఇంటిపై భారీ పోలీసు బందోబస్తు మధ్య దాడులు జరిపి, రోడ్డును ఆక్రమించుకొని నిర్మించిన కిరాణ దుకాణంతో పాటు రేకుల షెడ్డును కూల్చివేశారు.