సిటీబ్యూరో, జనవరి 1(నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం, సరఫరా జరగకుండా నిర్వహించిన ‘ఆపరేషన్ డ్రగ్స్’ సక్సెస్ అయినట్లు అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. వేడుకలు నిర్వహించే పబ్బులు, క్లబ్బులు, ఫామ్‌హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు, రిసార్ట్లు, స్టార్ హోటళ్లు వంటి దాదాపు అన్ని ప్రదేశాలను జల్లెడపట్టినట్లు ఈడీ తెలిపారు. ఇందులో భాగంగా 40 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, అందులో టీజీన్యాబ్, పోలీసులు, అబ్కారీ అధికారులతో కలిసి 17 బృందాలను ఏర్పాటు చేశామని, మిగిలిన బృందాల్లో ఎస్టీఎఫ్, డీటీఎఫ్, స్థానిక ఎక్సైజ్ అధికారులు ఉన్నారని, ఈ బృందాలన్నీ వేర్వేరుగా గ్రేటర్ పరిధిలోని వేడుకలు జరిగిన దాదాపు అన్ని ప్రదేశాలను సూక్ష్మంగా తనిఖీ చేసినట్లు వివరించారు.
వీటితోపాటు నగర, రాష్ట్ర సరిహద్దుల్లో పెద్దఎత్తున తనిఖీలు చేపట్టి డ్రగ్స్, గంజాయి, నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం నగరంలోకి రాకుండా నిరోధించగలిగామన్నారు. ఈ బృందాల పనితీరును ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడం జరిగిందని, ప్రతి బృందం గంట గంటకు వేడుకల్లోని పరిస్థితులను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరవేశారని, ఈ క్రమంలో అబ్కారీ, పోలీసు, టీన్యాబ్ అధికారులతో పాటు ముఖ్యంగా ప్రజల సహకారంతో 2025 నూతన సంత్సర వేడుకల్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని దాదాపుగా నియంత్రించగలిగామన్నారు. ఈ సందర్భంగా అబ్కారీ ఈడీ కమలాసన్‌రెడ్డి అబ్కారీ అధికారులు, సిబ్బందిని అభినందించారు.
Hyd6
ఇద్దరికి డ్రగ్ పాజిటివ్
బంజారాహిల్స్‌లోని కన్నాబిస్ పబ్ వద్ద ఇద్దరు వ్యక్తులకు డ్రగ్ పాజిటివ్ వచ్చిందని ఈడీ తెలిపారు. అయితే పబ్‌లో మాత్రం ఎక్కడ కూడా డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని, పాజిటివ్ వచ్చినవారు బయట డ్రగ్ తీసుకుని వచ్చినట్లు తెలుస్తుందన్నారు. పాజిటివ్ వచ్చినవారికి నోటీసులు ఇచ్చి, పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా అమీర్‌పేట, ఎస్ఆర్నగర్లోని హోటల్ గోకుల్ గ్రాండ్ ప్రాంతంలో జరిపిన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద 313 గ్రాముల గంజాయి, మరో వ్యక్తి వద్ద 3.313 గ్రామలు చొప్పున గంజాయి లభించినట్లు తెలిపారు.