బండ్లగూడ, మైలార్‌దేవ్‌పల్లి, ఆగస్టు 17: రోడ్డుపై మద్యం సేవిస్తు హంగామా సృష్టించిన ముగ్గురు ఆకతాయిలను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 16న బండ్లగూడ నుంచి ఆరాంఘర్ వైపు బైక్‌లపై వెళ్తున్న ముగ్గురు యువకులు బైక్‌లపైనే మద్యం తాగుతూ పక్కన ఉన్న ప్రజలకు, ఇతర వాహనాదారులకు ఇబ్బందులు కలిగిస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేశారన్నారు.
స్థానికులు వీడియో తీసి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించగా.. ఈ వీడియో ఆధారంగా యువకులను గుర్తించి వారిని ట్రేస్ చేయడం జరిగిందన్నారు. వారి డాక్యుమెంట్స్ చెక్ చేసి తదుపరి చర్యల నిమిత్తం మైలార్‌దేవ్‌పల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించడం జరిగిందన్నారు.