సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ) : యూరీ ఘటనకు బదులుగా 2016 సెప్టెంబర్‌లో భారత బలగాలు చేసిన సర్జికల్ స్ట్రయిక్‌లో డ్రోన్లు అత్యంత కీలకపాత్రను పోషించాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే మానవ రహిత డ్రోన్లను పాక్ ఉగ్ర స్థావరాల్లోకి సైన్యం తీసుకెళ్లింది. డ్రోన్ల ద్వారా సేకరించిన భౌగోళిక సమాచారం ఆధారంగా సునాయాసంగా చేరుకుని, ఉగ్రమూకలను తుద ముట్టించారు. దీనికి డ్రోన్లు అందించిన సమాచారమే కీలకం కాగా, హైదరాబాద్ ఇప్పుడు రక్షణ రంగానికి అవసరమైన డ్రోన్లను అందించే వేదికగా నిలిచింది. పదుల సంఖ్యలో సిటీ కేంద్రంగా అధునాతన ఆవిష్కరణలు పురుడు పోసుకోవడంతోపాటు దేశ రక్షణలోను కీలక పాత్రను పోషించే స్థాయికి ఎదిగాయి.
అధునాతన సాంకేతికత వినియోగం..
గడిచిన ఐదేళ్లలో తెలంగాణలో డ్రోన్ల తయారీ, వినియోగం క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో యూఏవీ డ్రోన్లకు రూపకల్పన చేసే హబ్‌గా హైదరాబాద్ నిలుస్తుంది. రక్షణ రంగానికి అవసరమైన అన్ని రకాలను డ్రోన్లతో వ్యూహాత్మక దాడులు చేసే స్థాయిలో అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నాయి. ఇందులో సెక్ ధ్రువాన్ ఇన్నోవేషన్ సంస్థ చేసే గాల్లో ఉండే డ్రోన్లను లక్ష్యంగా దాడులు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదే విధంగా గ్రేన్ రోబోటిక్ అనే సంస్థ తయారు చేసిన ఇంద్రజాల్ యాంటీ డ్రోన్ వ్యవస్థ ద్వారా విస్తృత పరిధిలో యూఏవీ కౌంటర్ అటాక్ చేయగలుగుతుంది.
ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా పనిచేస్తూ శత్రువు ఆయుధాలను గాల్లో కలిపిస్తుంది. ఈ అధునాతన వ్యవస్థ ద్వారా డ్రోన్ అటాక్‌లకు వజ్రకవచంలా నిలువరిస్తాయి. ఇక జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్ అనే సంస్థ అమెరికా ఆధారిత రక్షణ రంగానికి చెందిన కంపెనీతో కలిసి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దూసుకుపోయే డ్రోన్లను ఉత్పత్తి చేస్తోంది. జెన్ టెక్, రేడాన్ సిస్టం అనే స్టార్టప్‌లు రూపొందించిన డ్రోన్ టెక్నాలజీ అన్నింటికి వైవిధ్యంగా ఉండటంతోపాటు, ఎలాంటి డ్రోన్లనైనా ముందుస్తుగానే పసిగట్టేస్తోంది. దీంతోపాటు గరుడ ఎయిరోస్పేస్ అనే సంస్థ కూడా డ్రోన్ల తయారీలో కీలకంగా వ్యవహరిస్తూ రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలను అందించే స్థాయిలో ఆవిష్కరణలలో దూసుకుపోతున్నాయి.
శత్రు దాడులను పసిగట్టి..
దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో కంటే హైదరాబాద్ ఏకో సిస్టమ్ బలోపేతంగా ఉంది. గడిచిన పదేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా అందుబాటులోకి పారిశ్రామిక విధానం అధునాతన ఆవిష్కరణలకు కారణమైంది. ఇలా ఆపత్కాళంలో శత్రు మూకలను తరిమికొట్టే ఆయుధ సంపత్తిని అందించే కర్మాగారంగా నిలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కార్యకలాపాలు కొనసాగించే ఎన్నో సంస్థలు అధునాతన యుద్ధ సామగ్రిని ముఖ్యంగా డ్రోన్లు, మానవరహిత గాలి వాహనాలను(యూఏవీ)లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వేదిక ఉన్న ఎన్నో కంపెనీలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి అధునాతన ఆయుధాలను అందించే స్థాయికి చేరుకున్నాయి. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా శత్రు దాడులను పసిగట్టి, నియంత్రించగలిగే డ్రోన్లు కూడా హైదరాబాద్‌లో జీవం పోసుకుంటున్నాయి.