సిటీ బ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఎండలు మండుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్‌లో నీటి కొరత ఏర్పడుతున్నది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు భూగర్భ జలాలను జలగల్లా పీల్చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు బోర్లతో నిండిపోతున్నాయి. నగర శివార్లలోని కుటలు, చెరవులతో పాటు మూసీ పరీవాహక ప్రాంతాల్లోని భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నారు. పెద్దపెద్ద ట్యాంకర్లతో నీటిని పీల్చేస్తున్నారు.
నగరానికి తాగునీటిని అందిస్తున్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్‌లో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. జంట జలాశయాల పరీవాహక గ్రామాల్లో బోర్లతో భూమికి చిల్లులు పెడుతున్నారు. నీటిని తోడుతూ అమ్ముకొని లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. అక్రమార్కులు నీటిని తోడేస్తుండటంతో ఇండ్లలోని బోర్లు అడుగంటిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారుల కండ్లకు కనిపించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అనుమతులు లేకుండా బోర్లు వేసుకుని ట్యాంకర్లతో నీటిని తరలిస్తుంటే కనీస తనిఖీలు చేపట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ అధికారులు ఒక్క అక్రమ బోరును కూడా సీజ్ చేయలేదని తెలుస్తున్నది.
క్షేత్రస్థాయిలో భారీగా జలదోపిడీ జరుగుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జంట జలాశయాల పరిధిలోని ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో అనుమతులు లేని బోర్లున్నాయి. వాటిలో సగానికి కూడా అనుమతులు లేవని తెలుస్తున్నది. మరోవైపు నగరంలోని చెరువులను ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాల్లోనూ బోర్లేసి నీటిని తోడేస్తున్నారు. ఫలితంగా జంట జలాశయాల పరిధిలోని వ్యవసాయ బోర్లు అడుగంటిపోయి వేసవిలో పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు మాత్రం అవేమీ కనిపించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
నగరంలో నీటి దందా యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొంతమంది అక్రమార్కులు ట్యాంకర్లపై జలమండలి, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ లోగోలను పెట్టుకుని నీటిని అక్రమంగా విక్రయిస్తున్నారు. పెద్దపెద్ద నిర్మాణాలు, కమర్షియల్ భవనాలకు నీటిని తరలించి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. బహిరంగంగా ప్రభుత్వ శాఖల అధికారిక లోగోలను ఇష్టానసారం వాడుతున్నా అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మూసీ పరీవాహక గ్రామాలతో పాటు, హిమాయత్‌సాగర్, కిస్మత్పూర్, వట్టినాగులపల్లి, గండిపేట, కోకాపేట, నల్లగండ్ల, కొల్లూరు, తెల్లాపూర్, అమీన్పూర్ వంటి గ్రామాల్లో అక్రమ బోర్లు వందలాదిగా వెలిశాయి.
ఇందులో సగానికి కూడా అనుమతులు లేవు. ఆయా ప్రాంతాల నుంచి భూగర్భ జలాలను తోడుకుని జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏ లోగోలతో హైరైజ్ భవనాల నిర్మాణాలకు నీటిని తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు అక్రమార్కుల నుంచి ఎప్పటికప్పుడు కావల్సినంత సహకారం అందుటుండటంతో తనిఖీలు మానేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమార్కులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పరస్పరం సహకరించుకుంటూ విలువైన భూగర్భ జలాలను దోచుకుంటున్నారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు, అక్రమార్కుల తీరుతో సాధారణ ప్రజల ఇండ్లలోని బోర్లు అడుగంటి ఇబ్బందులు పడుతున్నారు.