సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): వేసవి దృష్ట్యా రోగులు, సహాయకుల దాహార్తిని తీర్చేందుకు సర్కారు దవాఖానల్లో అదనంగా ఆర్వో ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎండాకాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా చూడాలని మంత్రి హరీశ్‌రావు వేసవి ప్రారంభానికి ముందు ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా నిలోఫర్‌లో పాతభవనంలోని ఆర్వో ప్లాంట్‌కు అదనంగా ఐసీయూ బ్లాక్‌లో రూ.15 లక్షలతో మరొకటి ఏర్పాటైంది. ఓపీ బ్లాక్ సహా అన్ని విభాగాలు, అన్ని ఫ్లోర్లలో మంచినీటి కూలర్లు పెట్టారు.
ఉస్మానియాలో ప్రస్తుతం ఉన్న రెండు ఆర్వో ప్లాంట్లకు తోడు రూ.13 లక్షలతో చేపట్టిన మరో 20వేల లీటర్ల సామర్థ్యమున్న ప్లాంట్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. గాంధీలో 3 ఆర్వో ప్లాంట్లు ఉండగా, త్వరలో అదనంగా ‘ఆర్వో’తో పాటు జలామృత కేంద్రం, ఎంఎన్‌జే దవాఖానలో రూ.16 లక్షలతో నూతన ఆర్వో ప్లాంట్ ఏర్పాటు కాబోతున్నాయి. నిలోఫర్, ఫీవర్ హాస్పిటల్ తదితర దవాఖానల్లోనూ మరిన్ని ఆర్వో ప్లాంట్లు, జలామృత కేంద్రాలు రానున్నాయి.