Hyderabad | ఎల్బీనగర్, ఏప్రిల్ 8 : ఎల్బీనగర్ జోన్లో పూడికతీత పనులు ప్రారంభం కాలేదు. హయత్నగర్, ఎల్బీనగర్, సరూర్నగర్ సర్కిళ్ల పరిధిలోని చాలా ప్రాంతాల్లో డ్రైన్లు, నాలాలు పూడుకుపోయాయి. వ్యర్థాలన్నీ పేరుకుపోయినా కనీసం సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు ఈ దిశలో ఆలోచన చేయడం లేదు. ముందస్తుగా ప్రతి ఏటా ప్రణాళికలు చేస్తున్నా అందుకు అనుగుణంగా లక్ష్యాలను చేరడంలో మాత్రం విఫలం అవుతున్నారు.
నాలాలను పూడిక తీశామని, డ్రైన్లు క్లీనింగ్ చేశామంటూ బిల్లులు పెట్టడం తప్పిస్తే పూర్తిస్థాయిలో ఈ పనులపై పర్యవేక్షణ కరువు అవుతోందన్న విమర్శలు ప్రతిసారీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ పనులను చేపడుతున్న కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కు కావడంతోనే ఈ పనుల్లో లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మూడు సర్కిళ్ల పరిధిలో ప్రతియేటా వర్షాకాలానికి ముందు పూడికతీత పనుల కోసం నిధులు మంజూరు అవుతున్నా అవి అనుకున్న రీతిలో పనులు జరుగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏప్రిల్ మాసం వచ్చినా పూడికతీత పనులకు అధికారులు ఇంకా శ్రీకారం చుట్టలేదు. ఈ పనులపై ప్రతియేటా ముందస్తుగానే ప్రణాళికలు చేస్తున్నా అందుకు అనుగుణంగా పక్కాగా పనులను చేయడం లేదని ఆయా ప్రాంతాల ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి.
ప్రధానంగా చైతన్యపురి నాలా, సరూర్నగర్ చెరువు కట్ట తూముల వద్ద నాలాలను ఒక్కసారి పరిశీలిస్తే వ్యర్థాలు పేరుకుపోయి కనీసం ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు లేవని స్పష్టం అవుతోంది. సాదారణంగా చెరువు నుంచి నాలాలోకి కలిసే నీరు సాఫీగా వెళ్లేలా ఈ ప్రాంతాన్ని క్లీన్ చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో అక్కడ డపింగ్ యార్డుగా మారిన దుస్థితిని నిత్యం ఈ దారిలో వెళ్తున్న సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ విషయంలో ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఏడాదైనా పూడికతీత పనులను త్వరగా ప్రారంభించి పూర్తిస్థాయిలో పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.