సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో నాలాలు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. నాలాల్లో పడి ప్రతి ఏటా వర్షాకాలంలో ఒకరిద్దరు చనిపోతున్నా హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల్లో చలనం రావడం లేదు. గతేడాది పాతబస్తీ, ఎల్బీనగర్ ఘటనలు మరవకంటే ముందే రెండు రోజుల కిందట ఆసిఫ్‌నగర్, ముషీరాబాద్ వినోబానగర్ చెందిన దినేశ్ (సన్నీ), అర్ణున్, రాములు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరి అచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అయితే హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయ లోపంతోనే నాలా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలా పేరువింటేనే వెన్నులో వణుకు కొన్ని ప్రాంతాల్లో కాలనీలు, బస్తీల నివాసాల మధ్యే నాలాలున్నాయి. ప్రతి ఏటా నాలాల వల్ల పలువురు చనిపోవడం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్లో రోడ్డుకు సమాంతరంగా నాలాలు ఉండడం వల్ల వరద ముంచెత్తినప్పుడు ఓపెన్ నాలాలు కనబడక అందులో పడి చాలా మందిప్రాణాలు కోల్పోతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో వరద నీటి కాలువల పొడవు 1302 కిలోమీటర్ల మేర ఉండగా, 390 కిలోమీటర్లు మేజర్ నాలా, మైనర్ డ్రైయిన్స్ 912 కిలోమీటర్లు మేర ఉన్నాయి. ముఖ్యంగా నాలాల ప్రమాదాలు జరిగే వల్బారెబుల్ పాయింట్‌ను గుర్తించి ఆ ప్రదేశాలలో చైన్ లింక్ మేష్, ప్రమాద నివారణకు హెచ్చరిక సైనేజీ బోర్డు, ప్రీకాస్ట్ స్లాబ్స్ పనులు చేపట్టాలి.
కాగా, హైడ్రాకు అనుభవం లేకపోవడంతో నిర్వహణ సరిగా లేక నాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మల్లేపల్లి నాలాలో పూడికతీత, పరిశుభ్రత పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం మల్లేపల్లి నాలాను జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి పరిశీలించారు. అవసరమైన చోట నాలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.