Begumpet | బేగంపేట్, మార్చి 19 : లష్కర్లో రోడ్లన్నీ డ్రైనేజీ మురికి కూపాలుగా మారాయి. ఎక్కడ చూసిన రోడ్లపై డ్రైనేజి మురికి నీరు పొంగి పొర్లుతుంది. దీంతో ఆ ప్రాంతాలు దుర్గంధ భరితంగా మారుతున్నాయి. దీంతో పాటు రోడ్లపై రాకపోకలు సాగించలేక వాహనదారులు, పాదాచారులు అనేక అవస్థలు పడుతున్నారు.
ఈ సమస్య రాంగోపాల్‌పేట్, బేగంపేట్ డివిజన్లను కలిపే ప్రాంతాల్లో అనేక ఏండ్లుగా తలెత్తుతున్నాయి. కానీ ఇప్పటి వరకు పరిష్కారం కావడం లేదు. బేగంపేట్, రాంగోపాల్‌పేట్ డివిజన్లను కలిపై ప్రాంతాలైన ప్యారడైజ్ చౌరస్తా, సింధి కాలనీలు ఇక్కడ ప్రధాన ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా ప్రధాన రోడ్లపై డ్రైనేజి మురికి నీరు పొంగి పొర్లుతుంది. అయినా కానీ ఏ ఒక్క జలమండలి అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. గతంలో ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు అప్పుడు మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్ అధికారులతో వెనువెంటనే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు. ప్రస్తుతం అధికారులు ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.