Amberpet | అంబర్‌పేట, జూలై 2 : జీహెచ్ఎంసీ, వాటర్‌వర్క్స్ రెండు శాఖల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారుతోంది. ఈ రెండు శాఖల అధికారులు సమస్య తమది కాదంటే తమది కాదని ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటుండడంతో అక్కడి ప్రజలకు పాలుపోవడం లేదు. కాదుకదా.. సమస్య తీరడం లేదు. కష్టాలు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితి బాగ్‌అంబర్‌పేట డివిజన్ వైభవ్‌నగర్ కాలనీ, గాయత్రి టవర్స్ వద్ద దాపురించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ గాయత్రి టవర్స్ వద్ద గత 15 రోజుల నుంచి డ్రైనేజీ మురుగు మ్యాన్‌హోల్ నుంచి పొంగి రోడ్డు పైకి వస్తున్నది. ప్రతి రోజు ఉదయం డ్రైనేజీ మ్యాన్‌హోల్ నుంచి పొంగిన మురుగు ఒక దగ్గర చేరి చిన్నపాటి మడుగులా తయారవుతున్నది. దీంతో అటు నుంచి రాకపోకలు సాగించే స్థానికులు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మురుగుతో దుర్వాసన వెదజల్లుతున్నది. ఈ సమస్యను స్థానికులు అటు జీహెచ్ఎంసీ, ఇటు వాటర్‌వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా తమది కాదంటే తమది కాదని ఒకరిపై ఒకరు చెబుతున్నారు. వాటర్‌వర్క్స్ కు చెందిన ముగురు వచ్చి నాలాలో చేరుతుందని, అందుకే మురుగు బయటకు వస్తుందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతుండగా.. తమకు చెందిన డ్రైనేజీ మురుగును ప్రతి రోజు ఎయిర్‌టెక్ మిషన్‌తో తొలగిస్తున్నామని.. నాలాలో పూడికతీయకపోవడంతో మురుగు నిలిచిపోయి వెనక్కు వస్తుందని వాటర్‌వర్క్స్ అధికారులు అంటున్నారు. ఈ రెండు విభాగాల అధికారులు కూడా సమస్యను పరిష్కరించకపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అసలే వానాకాలం కావడంతో మురుగులో తాము బయటకు వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు. దీనికి తోడు చెత్తాచెదారం అక్కడే పడేస్తున్నారు. అది కూడా మరో సమస్యగా మారింది. ఈ సమస్యలపై సంబంధిత అధికారులకు ఎన్నసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడలేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని కోరుతున్నారు.