GHMC | చిక్కడపల్లి, మే17: అనుమతులకు విరుద్ధంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిర్మించిన డాక్టర్ శంకర్ ప్రజా ఆస్పత్రి భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు ముషీరాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ దేవేందర్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా ముషీరాబాద్ సర్కిల్ ఏసీపీ దేవేందర్ మాట్లాడుతూ.. ఆస్పత్రి భవనానికి జీహెచ్ఎంసీ సెల్లార్ ప్లస్ నాలుగంతస్తుల అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పారు. అదనంగా సెల్లార్‌తో పాటు మరో రెండు అదనపు అంతస్తులు అక్రమంగా నిర్మించారని తెలిపారు. స్థానికులు నిర్మాణంపై కోర్టుకు వెళ్లారని, కోర్టు ఆదేశాల మేరకు ఆ భవనంలో ఐదారంతస్తులు, సెల్లార్ సీజ్ చేశామని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.