కాచిగూడ,ఏప్రిల్ 1: ఇంటి పెద్దల ఆస్తులలో కుటుంబ సభ్యులకు వాటా ఇచ్చినట్లు చట్టసభల్లో కూడ బీసీల వాటా బీసీలకే ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ డాక్టర్ అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్ధంగా బీసీలకు సంక్రమించిన విస్తృత అధికారాలను కేంద్రం అమలు చేయాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అథవాలేను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ అరుణ్‌కుమార్, గుజ్జ సత్యం మాట్లాడుతూ బీసీ రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని,కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని వారు కోరారు.మహిళల 33 శాతం రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటను కల్పించాలని పేర్కొన్నారు.కేంద్రం బీసీల విద్య,ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు ఇచ్చేది బిక్షం కాదని,రాజ్యాంగ బద్దమైన ప్రజాస్వామ్య హక్కు అని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు.