Congress Govt | మేడ్చల్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): గ్యారంటీల అమలుకు పథకాల ఎంపికలో భాగంగా నిర్వహించే గ్రామ, వార్డు సభల నిర్వహణ సజావుగా జరుగుతుందా అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో నాలుగు పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, రైతు భరోసా పథకాలను అందించేందుకు ఈ నెల 21 నుంచి 24 వరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో అర్హుల ఎంపికపై గ్రామ, వార్డు సభలను నిర్వహించనున్నారు. సభల నిర్వహణతో అర్హులకు న్యాయం జరుగుతుందా లేదా అన్న సందేహాలను దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరిగిపోయిందని జరుగుతున్న ప్రచారంతో సభల నిర్వహణ నామ మాత్రంగానే జరగనుందా..? అన్న చర్చ జరుగుతున్నది.
21 నుంచి..
21 నుంచి 24 వరకు జరిగే గ్రామ, వార్డు సభల్లో అభ్యంతరాలను పరిశీలించి లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ దరఖాస్తుదారుల్లో నమ్మకం కలగడం లేదు. 26 తర్వాత అందించే నాలుగు గ్యారంటీల పథకాలపై అధికారులు సర్వే పేరిట మాత్రం హడావుడి చేస్తున్నారు. గ్రామ, వార్డు సభల నిర్వహణలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అర్హులుగా లేని వారిని జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంటుందని చెబుతున్నా.. వివిధ పథకాల్లో తాము చెప్పినట్లే లబ్ధిదారుల జాబితా ఉంటుందనే ధీమాతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అర్హుల ఎంపికలో అధికారులు కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి ఏ మేరకు ఎదుర్కొన్నరన్నది లబ్ధిదారుల ఎంపిక తర్వాత తేలనున్నది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా..
భూమి లేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ.12 వేల ఆర్థిక సాయాన్ని రెండు విడతలుగా అందించేలా లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తుల దారుల వివరాలను సేకరిస్తున్నారు. గత ఏడాది ఉపాధి హామీ పథకంలో అత్యధిక రోజులు పనిచేసిన వారిని అర్హులుగా గుర్తించే పనిలో ఉన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రెండు విడతలుగా అందించనున్నారు. జిల్లాలో 18,204 మందికి ఉపాధి జాబ్ కార్డులు ఉండగా, 19,242 మంది కూలీలు ఉన్నారు. ఇందులో ఎంత మందిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
50 శాతం భూములకు కట్..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 50 శాతం భూములకు రైతు భరోసాను కట్ చేయనున్నారు. జిల్లాలో 40, 975 మంది రైతులు ఉంటే.. 82,020 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. ప్రతి ఏడాది వానాకాలం సీజన్లో 35 వేల ఎకరాలు, యాసంగిలో 22 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు చూయిస్తున్నారు. దీంతో సగానికి సగం పైగా రైతు భరోసాను రైతులకు ఎగ్టొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు రైతుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం ద్వారా రూ. 79 కోట్ల నగదును రైతు ఖాతాల్లో జమ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒకటైన రుణమాఫీ జిల్లాలో 3,602 మంది రైతులకే అయ్యిందన్న విషయం తెలిసిందే.
1.43 లక్షల దరఖాస్తులు
ఇందిరమ్మ ఇండ్ల పథకం, రేషన్ కార్డుల జారీలో అర్హులను ఎంపిక చేస్తారా అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి 1.43 లక్షలు, రేషన్ కార్డులకు 1.22 లక్షల దరఖాస్తులను ప్రజాపాలనలో స్వీకరించిన విషయం తెలిసిందే.