Prajavani | సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే అందజేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వందలాది మంది లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. నగర నలుమూలల నుంచి వచ్చిన వీరంతా తొలుత ప్రజావాణి కార్యక్రమంలోకి వెళ్లారు. చాలా మంది బయట గార్డెన్లో బైఠాయించి డబుల్బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతులు కల్పించాలనే నినాదాలతో హోరెత్తించారు.
కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 66వేలకు పైగా లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు దాటినా.. ఆ ఇండ్ల సముదాయాల్లో మంచినీరు, కరెంటు, రోడ్డు సదుపాయాలు కల్పించలేదని మండిపడ్డారు. లిఫ్టులు పనిచేయడం లేదని, ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చివరకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి లబ్ధిదారులతో మాట్లాడారు. జలమండలికి ఇప్పటికే రూ. 200కోట్ల మేర నిధులు ఇవ్వాల్సి ఉన్నదని, రాబోయే రెండు నెలల్లోగా డబుల్ ఇండ్లలో మౌలిక వసతులు కల్పిస్తామని మేయర్ హామీ ఇచ్చారు.
రూ.100కోట్ల నిధులు ఏమయ్యాయి?
కేసీఆర్ ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంలో 66 లొకేషన్లలో మొత్తం 68,841 మందికి పట్టాలు అందజేసింది. ఇండ్లలో మౌలిక వసతుల కల్పనకు హెచ్ఎండీఏ నుంచి రూ. 100 కోట్లను జీహెచ్ఎంసీకి బదలాయించింది. కానీ నేటికీ ఆ నిధులు ఖజానా నుంచి నిర్వహణకు మళ్లలేదు. పైగా డ్రైనేజీ, నల్లా కనెక్షన్ వేసిన జలమండలికి నిధులు మంజూరు చేయలేదు. డబుల్ బెడ్రూం ఇండ్లకు తాజా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. అయితే రూ. 200కోట్ల నిధులను ఎలా సమకూర్చుకుని మౌలిక వసతులు ఎలా కల్పిస్తారన్నది స్పష్టత లేదు.
పార్కును కాపాడండి
అంబర్‌పేట: గోల్నాక డివిజన్ జైస్వాల్‌గార్డెన్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని, ఆ స్థలాన్ని తిరిగి కాలనీ వాసులకు ఇప్పించాలని కోరుతూ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస్ ముదిరాజ్, యాదవరెడ్డి తదితరులు ప్రజావాణిలో అంబర్‌పేట సర్కిల్ డీసీ మారుతీ దివాకర్‌ను కలిసి విన్నవించారు.
కలెక్టరేట్లో..
కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి 239 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా 156 దరఖాస్తులు గృహ నిర్మాణ శాఖకు సంబంధించినవి కాగా, పింఛన్లు 18, భూ సమస్యలు 14 దరఖాస్తులు వచ్చాయి.
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ ఆమ్రపాలితో కలిసి ఆమె ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించారు. బల్దియాలో జరిగిన ప్రజావాణిలో 57 దరఖాస్తులు రాగా, ఆరు జోన్లలో మొత్తం 93 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, జీహెచ్ఎంసీ శానిటేషన్, ట్రాన్స్‌పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం బల్దియాలో జరిగిన ప్రజావాణిలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కలిసి విన్నవించారు.