సిటీబ్యూరో, నవంబర్ 1 ( నమస్తే తెలంగాణ ): డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు సర్కార్‌కు తలనొప్పిగా మారింది. ఇండ్లు కావాలంటూ గతంలో దరఖాస్తు పెట్టుకున్న వారిని కాదనీ.. ఇప్పుడు మూసీ బాధితులకు ఇండ్లు కేటాయించడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూసీ పునరుజ్జీవనం- సుందరీకరణ కత్తిమీద సాములా మారుతోంది. పేదోళ్ల నివాసాలను కూల్చి.. వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తున్నప్పటికీ వాళ్లంతా నిరుత్సాహంగానే ఉన్నారు.
తమ ఇండ్లు కూల్చడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయిష్టంగానే డబుల్ ఇండ్లల్లో అడుగులు పెడుతున్నారు. సొంత ఇండ్లను లాక్కొని డబుల్ ఇల్లును కేటాయించడం.. ఉమ్మడి ఫ్యామిలీల నివాసాలకు ఉపయోగపడకపోవడంతో వాళ్లంతా సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇండ్లల్లో తిష్టవేసిన సమస్యలను సైతం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని వాపోయారు. ఇలాంటి సందర్భంలో సొంత ఇండ్లు కోల్పోయిన వారు.. డబుల్ ఇండ్లలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు.
బలవంతంగా వారికి ఇల్లు కేటాయించి తరలిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో తమకు ఇల్లు కావాలంటూ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు అందిస్తున్నారు. దరఖాస్తులు అధిక సంఖ్యలో రావడంతో కలెక్టరేట్లో గృహ నిర్మాణ శాఖలో ప్రత్యేక కౌంటర్ తెరిచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇది వరకు ఇచ్చిన దరఖాస్తులే లక్షల్లో ఉన్నాయి.
ఇప్పటికీ దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. దీంతో అర్హులు చాలా మంది ఉన్నారని గుర్తించినప్పటికీ డబుల్ బెడ్ రూంలను స్థానికంగా ఉన్న అర్హులను కాదనీ.. మూసీ బాధితులకు కేటాయించడంపై స్థానిక ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటువంటి గందరగోళ మూసీ పరిస్థితులు రేవంత్ సర్కార్‌కు ఊపిరి సలపనివ్వడం లేదు. ఎలాగైనా మూసీ నిర్మాణాలు కూల్చి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డికి అటు మూసీ బాధితులు, ఇటు స్థానిక జనం నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్య మూసీ నిర్మాణాల కూల్చివేతలు ఎలాంటి మలుపు తీసుకుంటాయోనని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.