
సిటీబ్యూరో, జూన్ 26(నమస్తే తెలంగాణ)/బేగంపేట్/బన్సీలాల్‌పేట్ : అవ్వ ముఖం మురిసింది. అక్క కండ్లు వెలుగులు విరజిమ్మాయి. చెల్లె కేరింతలతో సందడి చేసింది. ఆకాశాన్ని తాకే భవనాలు చూసుకుంటూ.. ఆశ్చర్యం ఓ వైపు.. కోట్ల విలువజేసే ఇండ్లల్లో ఇక నుంచి తాము నివసించబోతున్నామనే సంతోషం మరోవైపు.. వెరసి పీవీ ఘాట్‌లోని అంబేద్కర్‌నగర్ బస్తీ ఆనంద భాష్పాలకు నిలయంగా మారింది. శనివారం అధునాతనంగా నిర్మించిన 330 డబుల్ బెడ్రూంలను లక్కీ డ్రా తీసి బస్తీవాసులకు మంత్రి కేటీఆర్ అందించారు.
ఇంత మంచి ఇండ్లు అందించిన సీఎం కేసీఆర్ సార్‌కు “మీ నుంచి కావాల్సింది పచ్చదనం, పరిశుభ్రత”ను కాపాడుతామనే హామీ అంటూ కేటీఆర్ కోరడంతో బస్తీవాసులు కరతాళ ధ్వనులతో అంగీకారం తెలియజేశారు. ఈ డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
‘అతి ఖరీదైన భూములు అవి. పర్యాటక ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న స్థలాలు. వాటిని వాణిజ్య అవసరాలకు ప్రభుత్వం వాడుకోవచ్చు. గత పాలకులు ఉంటే పేదలను తరిమేసి భూములను లాక్కునేవారే. కాని, తెలంగాణ రాష్ట్రంలో అలా జరగలేదు. కోట్ల విలువైన భూముల ముందు పేదవాళ్లే ముఖ్యమని భావించింది. కొన్నేండ్లుగా అదే భూమిని నమ్ముకుని నివసించిన వారి మొఖంలో సంతోషం చూడాలనుకుంది. డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి పేదోళ్లకు బహుమతిగా అందించింది సర్కార్.”
“ఇన్నాళ్లు వారి కష్టాల జీవితంలో సుందరమైన హుస్సేన్ సాగర్ వారికి ఇంపుగా కనిపించలేదు. వారి కండ్ల ముందే పర్యాటకులు సాగర్ చుట్టూరా తిరుగుతూ సంతోషంగా గడుపుతుంటే, ఆ సంతోషాలు తమ ముఖంపై ఎప్పుడు చిగురిస్తాయోనని దిగులు చెందారు. సాగర్ అలలు వారిని తరిమేస్తున్నట్టుగా చిన్నబోయారు. వారి గుడెసెల ఇక్కట్లు వాళ్ల మనసులను అంతలా కమ్మేశాయి. అట్లాంటి హుస్సేన్ సాగర్ ఇప్పుడు వారికెందుకో.. ఆత్మీయ ప్రాంతంగా అనిపిస్తుంది. సాగర్ అలలు వారికి స్నేహితులుగా కనిపిస్తున్నాయి. పర్యాటకులు వారికి అతిథులుగా తలపిస్తున్నారు. ఇన్నాళ్లు కష్టాల కండ్లల్లో నుంచి చూసిన ఆ హుస్సేన్ సాగర్.. ఇప్పడు వారికెందుకో ఆనందాలను పంచుతున్నట్టుగా భావిస్తున్నారు. కారణం.. కేసీఆర్”
“కాలనీలో పెద్ద ఎత్తున చెట్లు పెంచాలి. ఈ బాధ్యతను మహిళలే తీసుకోవాలి. మురికికూపంగా మారిన హుస్సేన్‌సాగర్‌ను శుద్ధిచేసే పనులు కొనసాగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ కాలనీ వాసులు వ్యర్థాలను సాగర్‌లో వేయకుండా ఉండాలి. ఎవ్వరినీ అందులో చెత్త వేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా కాలనీవాసులదే. ఇండ్లలోని చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ చెత్త సేకరణ సిబ్బందికే ఇవ్వాలి. అంబేద్కర్‌నగర్ హౌసింగ్ కాలనీలో పైఅంతస్తుల కోసం లిఫ్టులను కూడా ఏర్పాటు చేశాం.
లిఫ్టులు, కాలనీ నిర్వహణ భారం లబ్ధిదారులపై పడకుండా ఉండేందుకు 26 దుకాణాలను నిర్మించాం. దీని ద్వారా వచ్చే అద్దెలతో కాలనీ నిర్వహణ చేపడతాం. కాలనీవాసులు ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలి. ముఖ్యంగా మహిళలు ముందుకొచ్చి బాధ్యత తీసుకోవాలి. లబ్ధిదారులందరికీ లాటరీ పద్ధతిలో ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తాం. దుకాణాలను కూడా ఇదే విధానంలో కేటాయిస్తాం. – లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్
“నాడు గుడెసెల్లో నివాసం. వానొస్తే.. కూలుతుందని భయం.. మండుటెండల్లో భానుడి భగభగలు.. శీతాకాలం చలితో భయానక వాతావరణం.. చిరిగిన వస్ర్తాలే ఇంటి పై కప్పు భాగాలు.. తీవ్రంగా గాలి వీస్తే కొట్టుకుపోయే తడకల గదులు.. ఇరుకుగా ఉండే అట్లాంటి గుడిసెల్లో ఇంటిల్లిపాది నివసించారు. కురిసిన చినుకులకు అడ్డుగా బకెట్ పెట్టుకున్న అనుభవాలు ఏండ్ల కొద్దీ వారిని వెంటాడాయి. ఎండవేడికి ఏమి చేయాలో అర్థం కాక పడిన వ్యథలు వారి జీవితాలను శాసించాయి. ఎవరికైనా ఇళ్లు.. అన్నీ బాధలు మర్చిపోయి హాయిగా సేద తీరే వేదిక అవుతుంది. కాని, ఆ నిరుపేదలకు ఇన్నాళ్లుగా వారి నివాసాలు పేదరికాన్ని గుర్తు చేస్తూ నిద్ర పట్టని రాత్రులను మిగిల్చాయి. ఇల్లు కట్టించమని ఉమ్మడి పాలకులను వేడుకుంటే ‘మీ మొహాలకు ఖరీదైన భూముల్లో అవసరమా’? అని హేళన చేశారు. ఇక్కడ కట్టించడం అసాధ్యమని చేతులు దులుపుకున్నారు.”
“ఇప్పుడు దశ మారింది. వారి జీవితాల్లో వెలుగులు నిండాయి. తెలంగాణ సీఎం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వారి బతుకులు మార్చే ‘డబుల్ ఇండ్ల’ నిర్మాణాలు తీసుకొచ్చారు. విశ్వనగరంగా దూసుకుపోతున్న హైదరాబాద్ నడిబొడ్డున అత్యధిక ఖరీదైన భవనాలను తలదన్నేలా అపార్ట్మెంట్లు నిర్మించి వారికి కానుకగా అందజేశారు. ఈ జీవితంలో ఇల్లు ఓ కలగా బతికే ఆ బక్కప్రాణులకు నేనున్నానంటూ అండ గా నిలిచారు. కోటి రూపాయలకు పైగా ధర పలికే ఆ ఇండ్లను గుడెసెవాసులకు అందించి ప్రభుత్వం పేదల పెన్నిదిగా నిలిచింది.”
గత ప్రభుత్వాలు, పాలకులు మా బస్తీ నుంచి మమ్ముల్ని ఖాళీ చేయించాలని చూసినయి. హుస్సేన్‌సాగర్ దగ్గర్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని చెప్పిన్రు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మా బస్తీకి వొచ్చి, ఇంజినీర్లతో మాట్లాడి మరో వందేండ్లు నిలిచేలా పటిష్టమైన ఫౌండేషన్‌తో అద్భుతమైన ఇండ్లను నిర్మించిన్రు. పేదల జీవితాలు బాగుపడుతుంటే చూసి ఓర్వలేక మా బస్తీతో సంబంధం లేని వారితో కోర్టులో కేసులు వేయించి అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ధర్మం గెలిచింది. పేదలకు న్యాయం జరిగింది. సీఎం కేసీఆర్, మంత్రి తలసానిపై మేము పెట్టుకున్న నమ్మకం గెలిచింది. 330 కుటుంబాలు ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదాలు అందిస్తున్నాయి.- ఎం.గణేశ్ , ప్రధాన కార్యదర్శి అంబేద్కర్‌నగర్ బస్తీ
మా అంబేద్కర్‌నగర్ బస్తీలో హిందూ, ముస్లిం ప్రజలంతా ఐక్యంగా ఉంటం. కాల్వ పక్కనే ఇండ్లు ఉండటం వల్ల విపరీతమైన దోమలు ఉండేవి. వానొస్తే ఇండ్లలోనే తడుస్తూ, వరదొస్తే నీటిని బకెట్లతో పారబోసేటోళ్లం. బస్తీని తొలగించి ఆత్మగౌరవంతో జీవించేలా ఇంత మంచి భవనాలు నిర్మిస్తారని కలలో కూడా ఊహించలేదు. అన్ని మతాలకు సమానంగా గౌరవిస్తున్న అద్భుతమైన ప్రభుత్వం ఇది. – రుకియాబేగం
సికింద్రాబాద్‌లోని ఐడీహెచ్ డబుల్ బెడ్రూం గృహ సముదాయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, అదే సందర్భంలో అంబేద్కర్‌నగర్ బస్తీని చూశారు. ఆ వెంటనే నన్ను పిలిపించి.. డబుల్ బెడ్రూం ఇండ్ల్ల సముదాయాన్ని మంజూరు చేశారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సంకత్పంతో సీఎం డబుల్ బెడ్ రూం పథకాన్ని చేపట్టారు. కేంద్రం ప్రభుత్వం కేవలం 30 శాతం మాత్రమే రాయితీ ఇస్తూ, మిగిలిన 70 శాతం భారాన్ని లబ్ధిదారులపై మోపుతున్నది. కానీ..రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నది. లబ్ధ్దిదారులందరికీ ఇండ్లు వస్తాయి. ఎవరూ ఆందోళన చెందవద్దు. -మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
డబ్బుయ్యేండ్ల నుంచి ఇరుకైన ఇండ్లలో మాకు ఎదురైన కష్టాలు ఆ దేవునికే ఎరుక. ఇక్కడే పెండ్లీలు చేసుకొని, పిల్లలను కని వారికి పెండ్లీలు చేసి, మళ్లా వాళ్ల పిల్లలతో ఇక్కడే ఉంటున్నం. ఇంతకు ముందొచ్చిన కాంగ్రెసోళ్లు ఇక్కడ ఇండ్లు కట్టియ్యడం వీలు కాదన్నరు. కానీ, దేవుని రూపంలో మా బస్తీకి వచ్చిన కేసీఆర్ సార్ మా ఇండ్లను చూసి చాలా బాధపడ్డడు. నన్ను నమ్ముండ్రి.. మీకు మంచి ఇండ్లు కట్టిస్తామని మాట ఇచ్చిన్రు. ఆ ప్రకారమే ఇయ్యాల ఆయన కొడుకు చేతుల మీదుగా కొత్త ఇంటి తాళాలను అందుకున్నాము. భర్తలేని నా లాంటి వాళ్లకు నెలకు రూ.2 వేల పింఛన్ ఇస్తున్రు, రేషన్ కార్డు మీద మంచి బియ్యం ఇస్తున్రు.
మా మనవరాలి పెండ్లికి లక్ష రూపాయల కల్యాణ లక్ష్మి సొమ్మును కూడా ఇచ్చిన్రు. ఇంత మంచి సర్కార్‌ను నేనెప్పడు చూడలేదు. 1984లో మా ఆయన మాతంగి నర్సింహ ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్‌గా పని చేసిండు. ఇన్నెండ్లకు మా బస్తీకి కొత్త రూపం వచ్చింది. అందుకు కారకులైన సీఎం కేసీఆర్ సారు మా పాలిట దేవుడు. ఆయనను, మంత్రి శ్రీనివాస్ యాదవ్‌లను మేమెన్నటికీ మరువం. – ఎం.దేవమ్మ
అరవయ్యేండ్లుగా కాల్వ పక్కన ఈ బస్తీలోనే బతికినం. మా ఆయన మహ్మద్ ఇస్మాయీల్ మటన్ దుకాణంలో పని చేసేటోడు. మాకు ఒక కొడుకు, ఆరుగురు ఆడబిడ్డలున్నారు. ఇక్కడనే అందరికి పెండ్లీలు చేసినం. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నమ్మకంతో మేము ఇండ్లను ఖాళీ చేసి కిరాయి ఇంట్లోకి పోయినం. సీఎం సారు మాకు ఇల్లు ఎప్పుడిస్తడోనని అనుకునేటోళ్లం. మా ఆయన చాలా సంతోషపడేటోడు. ఇంత మంచి ఇండ్లు కట్టిండ్రు కాని, నెల రోజుల కొందనే మా ఆయన కాలం చేసిండు. మా ఆయన బతికి ఉంటే ఇల్లు చూసి మురిసిపోయేటోడు. ఇరుకుగా ఉన్న ఇల్లులో మేము ఎన్నో బాధలు పడ్డం. కేసీఆర్ సార్‌కు ఎంతో రుణపడి ఉంటం. కేసీఆర్ సారు దయతో నా చిన్న బిడ్డ పెండ్లికి ‘షాదీ ముబారక్’ ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా అందుకున్నాం.- హఫీజాబీ
ముఖ్యమంత్రి కేసీఆర్ సారు స్వయంగా మా బస్తీకి వచ్చి మా బాధలు చూసిండ్రు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలాసార్లు బస్తీలో మీటింగులు పెట్టి అద్భుతమైన ఇండ్లు ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నరు. కరోనా రావడం, లాక్డౌన్ల కారణంగా నిర్మాణంలో ఆల్చమైంది. ఐదేండ్లుగా మేము లింగంపల్లిలో కిరాయికి ఉంటున్నం. ఏడాదికి రూ.50 వేల చొప్పున ఇప్పటికి రెండున్నర లక్షలు ఇండ్ల కిరాయిలు కట్టినం. కిరాయి ఇండ్లల్లో అద్దె చెల్లించడం చాలా కష్టమైంది. సీఎం కేసీఆర్ దయ వల్ల ఇప్పుడు మాకు అన్ని వసతులతో కూడిన ఇండ్లు రావడం మాటల్లో చెప్పలేని సంతోషం కలిగింది. గరీబోళ్ల జీవితాలను మార్చిన ఈ ప్రభుత్వానికి జేజేలు, చాలా కృతజ్ఞతలు. – బి. జ్యోతి