సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 3వ విడతలో ఎంపికైన లబ్ధిదారులకు గురువారం (నేడు) ప్రజాప్రతినిధులు ఇండ్లను పంపిణీ చేయనున్నారు. పేద ప్రజలు ఎంతో గొప్పగా బతకాలి, సొంత ఇంటి కలను నెరవేర్చాలనే సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు రూ. 9,600 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఎంతో విలువైన స్థలాల్లో ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నిర్మించిన ఇండ్లను ఎంతో పారదర్శకంగా, రాజకీయ ప్రమేయం లేకుండా, పార్టీలకు అతీతంగా ఆన్లైన్లో డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మొదటి విడతలో 11,700 మందికి, రెండో విడతలో 13,200 మందికి , మూడో విడతగా ఈ నెల 2న 19,020 మంది లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేశారు. మూడో విడత లక్కీడ్రాలో మిగిలిన 17,676 ఇండ్లను ఏడు ప్రాంతాల్లోని లబ్ధిదారులకు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.